
ఆర్ధిక సంస్కరణల కారణంగా భారత దేశం ఆర్థికంగా పలు రంగాలలో విశేషంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఇప్పటికీ వ్యవసాయ రంగంలో సంస్కరణలు చోటుచేసుకోలేక పోవడం పట్ల వివిధ ప్రాంతాలకు చెందిన రైతు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాజకీయాలతో సంబంధం లేకుండా వ్యవసాయ సంస్కరణలకు ప్రయత్నం జరగాలని అభిలాషను వ్యక్తం చేశారు.
అఖిల భారత కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ (కేరళ) నేత ప్రొఫెసర్ బాబు జోసెఫ్ నేతృత్వంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ రైతు నాయకులు, న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు ఈ విషయమై మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ ఎంపీ శశి థరూర్ తో ఢిల్లీలో మంగళవారం భేటీ జరిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ సంస్కరణల తక్షణ అవసరాన్ని ప్రస్తావిస్తూ, భారతదేశంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభకర పరిస్థితులపై వారు సమాలోచనలు జరిపారు.
వివిధ రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. రాష్ట్రాల వారీగా ప్రధానమైన అంశాలను గుర్తించాలని శశిథరూర్ వారికి సూచించారు. ఈ విషయమై పార్లమెంట్ లో తనవంతుగా ప్రస్తావన చేయగలనని హామీ ఇచ్చారు. భారత వ్యవసాయానికి స్థిరమైన, న్యాయమైన భవిష్యత్తు కోసం తమ నిబద్ధతను ఈ నాయకులూ పునరుద్ఘాటించారు.
రైతు నాయకులు డాక్టర్ థరూర్ను పార్లమెంటులో రైతుల గొంతును పెంచాలని కోరారు. రైతులు ఏ రాజకీయ పార్టీతోనూ పొత్తు పెట్టుకోరని వారు స్పష్టం చేస్తూ తమ ఏకైక డిమాండ్ రాతుల శ్రేయస్సు, అర్థవంతమైన సంస్కరణలు, రాజ్యాంగ- అధికారిక మార్పులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉండటం, జీఎం రకాలు వంటి మెరుగైన విత్తనాలు సహా స్వేచ్ఛా మార్కెట్కు అవకాశం కల్పించడంగా వారు వివరించారు.
భూపేందర్ సింగ్ మాన్ (మాజీ ఎంపీ, జాతీయ అధ్యక్షుడు బికేయు & చైర్మన్, ఏఐకెసిసి), వామన్రావ్ ఎస్. చతాప్ (మాజీ ఎమ్మెల్యే, షెట్కారి సంఘటనాన్), శ్రీమతి. సరోజ్ కాషికర్ (మాజీ ఎమ్మెల్యే, షెత్కారీ సంఘటన్), అజయ్ అన్మోల్ (బికేయు, యుపి అధ్యక్షుడు), ఆర్ వి. సత్యనారైన్, అనిల్ ఘన్వత్ (షెత్కారీ సంఘటన్, మాజీ సభ్యుడు సుప్రీంకోర్టు కమిటీ), శ్రీమతి. సీమా వాసుదేవ్, గుని ప్రకాష్ (సభ్యుడు ఎం ఎస్ పి కమిటీ, అధ్యక్షుడు బికేయు, హర్యానా), గురుపర్తాప్ సింగ్ మాన్ (పంజాబ్), అడ్వా. పి సురేశన్ (సుప్రీంకోర్టు) బినోద్ ఆనంద్ (ఎఐకెసిసి, సభ్యుడు ఎం ఎస్ పీ కమిటీ), అవినాష్ చంద్ర, అడ్వా. కె.ఎస్. గీత (చెన్నై), ఎస్. బాల్రాజ్ సింగ్ (పంజాబ్), జివివి సత్యనారాయణ (విజయవాడ) తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
More Stories
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు
ఇది ప్రతి భారతీయుడి విజయం
నేపాల్ సుస్థిరత భారత్కు ఎంతో కీలకం