
అమెరికాలో నిబంధనలు ఉల్లంఘించిన 6వేల మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను అక్కడి విదేశాంగశాఖ అధికారులు రద్దు చేశారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు అంతర్జాతీయ మీడియాకు తెలిపారు. వీసాలు రద్దైన వారిలో 4 వేల మంది దాడులు, మత్తులో డ్రైవింగ్, దోపిడీలకు పాల్పడిన ఘటనల్లో భాగమయ్యారని పేర్కొన్నారు.
ఉగ్రవాదానికి మద్దతిచ్చినందుకు దాదాపు 300 మంది విద్యార్థుల వీసాలు రద్దు అయినట్టు వివరించారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆ దేశంలో నిబంధనలు ఉల్లంఘించిన విదేశీ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఓవర్‌స్టే, నిబంధనల ఉల్లంఘన వంటి కారణాలతో తాజాగా 6 వేల మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసినట్టు అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఈమేరకు అమెరికా విదేశాంగశాఖ ఈ విషయాన్ని తెలిపినట్లు పేర్కొంది.
కొత్త విద్యాసంవత్సరం ప్రారంభంలో ఈ వీసాల రద్దు వ్యవహారం వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా అధికారం చేపట్టినప్పటి నుంచి అమెరికాలో ఉన్నత విద్యావ్యవస్థను పునర్ వ్యవస్థీకరించే పనిలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగానే అమెరికా పౌరులకు ఇబ్బంది కలిగించే చర్యలకు విదేశీయులు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
ప్రధాన విశ్వవిద్యాలయాలను లక్ష్యంగా చేసుకొని తీవ్రస్థాయిలో విధానాల మార్పులు చేపట్టారు. ఇవి అంతర్జాతీయ విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. తొలుత జనవరిలో యాంటీసెమిటిజమ్-యూదులపై వ్యతిరేకత అరికట్టేలా బిల్లును పాస్ చేశారు. అంతర్జాతీయ విద్యార్థులు పాలస్తీనాకు మద్దతుగా ఆందోళనలు చేపడితే ఈ ఆదేశాల ప్రకారం వారిని దేశ బహిష్కరణ చేసేలా చట్టాలు తీసుకొచ్చారు.
విదేశీ విద్యార్థులకు కొత్త ఇంటర్వ్యూల షెడ్యూల్‌ను నిలిపివేస్తూ జూన్‌లో ట్రంప్ కార్యవర్గం నిర్ణయం తీసుకొంది. అనంతరం సోషల్ మీడియా వెట్టింగ్‌ను కఠినతరం చేశారు. ఫారెన్ స్టూడెంట్స్ కచ్చితంగా వారి సోషల్ మీడియా ఖాతాలు బహిర్గతం చేయాలని ఆదేశించారు.
విద్యార్థుల పోస్టులు, కామెంట్లు, లైక్‌లను అమెరికా అధికారులు పరిశీలించి, వారు జాతీయ భద్రతకు ముప్పు కాదు అని భావిస్తే మాత్రమే వీసా ప్రక్రియలో ముందుకువెళతారని స్పష్టం చేశారు. విదేశీ విద్యార్థుల డేటాను సేకరించే సంస్థ ఓపెన్ డోర్స్ ప్రకారం 2023-24 విద్యా సంవత్సరంలో 210కి పైగా దేశాల నుంచి 11 లక్షల మందికిపైగా అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలోని వివిధ కళాశాలల్లో చేరారు.
More Stories
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్, స్విట్జర్లాండ్‌లకు భారత్ హెచ్చరిక