రాజస్థాన్‌లోని కోట-బుండిలో గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం

రాజస్థాన్‌లోని కోట-బుండిలో గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం
రాజస్థాన్‌లోని కోట-బుండిలో రూ.1,507 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. ఒడిశాలోని కటక్-భువనేశ్వర్‌లలో రూ.8,307 కోట్లతో ఆరు లేన్ల యాక్సెస్-కంట్రోల్డ్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపింది. మొత్తం రూ.9,814 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 
 
రాజస్థాన్ ప్రభుత్వం కోట-బుండి విమానాశ్రయానికి ఉచితంగా భూమిని ఇస్తుందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిధులు సమకూరుస్తుందని, 1,089 ఎకరాల భూమిని రాజస్థాన్ ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని మంత్రి చెప్పారు. కొత్త విమానాశ్రయం సంవత్సరానికి 20 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని పేర్కొన్నారు. 
 
ఈ విమానాశ్రయం ప్రాంతీయ కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తుందని, స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంచుతుందని వైష్ణవ్ తెలిపారు.  24 నెలల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు. గత 11 సంవత్సరాల్లో దేశంలో పనిచేస్తున్న విమానాశ్రయాల సంఖ్య 2014లో 74 నుంచి 2025లో 162కి రెట్టింపు అయ్యిందని ఆయన అన్నారు. విమాన ప్రయాణికుల సంఖ్య కూడా 2014లో 16.8 కోట్ల నుంచి ఈ సంవత్సరం 41.2 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.