భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) దేశ భవిష్యత్తును మార్చబోయే ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. ఏకంగా 40 అంతస్తుల భవనం అంత ఎత్తుతో భారీ రాకెట్‌ను నిర్మించే పనిలో ఉన్నట్లు ఆ సంస్థ ఛైర్మ్న్ వి. నారాయణన్ వెల్లడించారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఈ విషయాలను వెల్లడించారు. 35 కిలోల పేలోడ్‌తో మొదలు పెట్టిన భారతీయ అంతరిక్ష ప్రయాణం ఇప్పుడు 75,000 కిలోల బరువైన ఉపగ్రహాలను లో ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈఓ)లోకి తీసుకెళ్లగలిగే ఒక మెగా రాకెట్‌ను తయారు చేసే స్థాయికి ఎదిగిందని తెలిపారు. ఇది కేవలం సాంకేతిక విజయం మాత్రమే కాదని, వ్యూహాత్మకంగా, ఆర్థికంగా కూడా దేశానికి ఎనలేని ప్రయోజనాలను చేకూరుస్తుందని స్పష్టం చేశారు. దాదాపు 40 అంతస్తుల ఎత్తు ఉండే ఈ రాకెట్ ఇస్రో హెవీ-లిఫ్ట్ ప్రయోగాలకు వెన్నెముకగా నిలవనున్నట్లు పేర్కొన్నారు.దీని సామర్థ్యం భారత మానవ అంతరిక్షయాన కార్యక్రమం ‘గగన్‌యాన్’కు, అలాగే లోతైన అంతరిక్ష పరిశోధనలకు, చంద్రుడు, అంగారకుడిపై భవిష్యత్ మిషన్లకు ఒక కొత్త ఊపునిస్తుందని చెప్పారు. ఇది ఏకంగా అంతరిక్ష స్టేషన్ మాడ్యూళ్లను, పెద్ద సంఖ్యలో ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి తీసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని పేర్కొన్నారు.
అంతరిక్ష ప్రయోగాల్లో ఇది ఒక ‘గేమ్-ఛేంజర్’గా మారబోతుందని నిపుణులు భావిస్తున్నారు.
ప్రస్తుతం ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలు కూడా ఇలాంటి సూపర్-హెవీ లాంచ్ వెహికిల్స్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. వాణిజ్య ఉపగ్రహ ప్రయోగ మార్కెట్లో మన దేశ వాటా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే భారత్‌కు కక్ష్యలో55 ఉపగ్రహాలు ఉన్నాయని చెప్పారు. వచ్చే మూడు లేదా నాలుగేళ్లలో వీటి సంఖ్య మూడు లేదా నాలుగు రెట్లు పెరగనుందున్నారు. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో కూడిన ప్రయోగాలకు ఇస్రో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
చంద్రయాన్-3, మంగళ్యాన్ వంటి మిషన్ల విజయాలు మనకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ మెగా రాకెట్ కేవలం అంతరిక్ష పరిశోధనలకు మాత్రమే పరిమితం కాదు. దీనికి వ్యూహాత్మక ప్రాముఖ్యత కూడా ఉంది. దీని ద్వారా రక్షణ రంగానికి అవసరమైన భారీ కమ్యూనికేషన్, నిఘా ఉపగ్రహాలను సులభంగా అంతరిక్షంలోకి పంపవచ్చు. ముఖ్యంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో దేశ రక్షణ సన్నద్ధతను ఇది మరింత బలోపేతం చేస్తుంది. భవిష్యత్తులో దేశ భద్రతకు, ఆర్థిక ప్రగతికి అంతరిక్ష సామర్థ్యం ఒక కీలకమైన అంశంగా మారనుంది.
More Stories
ఆయుర్వేద పద్ధతులను, యోగాను అణచి వేసే కుట్ర
లొంగిపోయిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు సుజాతక్క
17 నుంచి `సేవా పక్షం అభియాన్’గా మోదీ జన్మదినం