
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో ఇటీవల వెలుగులోకి వస్తున్న అవినీతి వ్యవహారంలో మాజీ మంత్రి కేటీ రామారావు, ఎమ్మెల్సీ కవిత పాత్రపై వస్తున్న ఆరోపణలతో తెలంగాణ క్రికెట్ రాజకీయమయమైందనే విమర్శలు చెలరేగుతున్నాయి. క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి మీడియాతో మాట్లాడుతూ హెచ్‌సీఏలో క్విడ్‌ప్రోకో డీల్స్ జరిగాయని తేల్చి చెప్పారు.
సీఐడీ దర్యాప్తులో ఇప్పటికే అనేక అనుమానాస్పద అంశాలు బయటపడుతున్నాయని పేర్కొంటూ బీసీసీఐ రాష్ట్ర అసోసియేషన్లకు స్పష్టంగా నిబంధనలు తెలిపిందని, కానీ హెచ్‌సీఏ మాత్రం వాటిని గాలికొట్టేసిందని ఆరోపించారు. కోర్టుల్లో కేసులు వేస్తూ అసోసియేషన్ అధికారికంగా గందరగోళానికి లోనవుతోందని ఆయన విమర్శించారు. బీసీసీఐ ఐటీ సబ్‌కమిటీలో కేటీఆర్ సభ్యత్వాన్ని నిలుపుకోవడం ప్రశ్నార్ధకమని గురువారెడ్డి చెప్పారు.
ఇక రాజ్ పాకాలు, కేటీఆర్ బంధువుని టిక్కెట్ల కాంట్రాక్టు ఇచ్చారని ఆరోపించారు. ఇది బిసిసిఐ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. గురువారెడ్డి ఆరోపించిన మరో కీలక విషయం ఆడిట్ రిపోర్టులపై జరిగిన మోసం. పదేళ్లుగా ఒకే ఆడిట్ రిపోర్టుని కాపీ పేస్ట్ చేస్తూ హెచ్‌సీఏలో ఆర్థిక మోసాలు జరిగాయని తెలిపారు. ఇది బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం క్లబ్బుల అభివృద్ధి కోసం రూ. 6.10 కోట్లు కేటాయిస్తున్నారని, కానీ ఆ క్లబ్బుల్లో కొన్ని అసలు టీమ్‌లు లేకపోయినా నిధులు వచ్చాయని గురువారెడ్డి ఆరోపించారు. ఇది నిధుల దుర్వినియోగమే అని స్పష్టంగా చెప్పారు.
హెచ్‌సీఏ పరిపాలన ఖర్చులకే నెలకు రూ. 12 కోట్లు వెచ్చించాని పేర్కొంటూ “అంత మొత్తం ఏ ఖర్చులకు వెళ్తుంది?” అనే ప్రశ్నను గురువారెడ్డి ఎత్తి చూపారు. సరైన లెక్కలు లేవని, ఖర్చులపై స్పష్టత లేదని విమర్శించారు. సీఐడీ దర్యాప్తుతో పాటు, బీసీసీఐ కూడా ఈ వ్యవహారంపై నిఘా పెట్టినట్టు సమాచారం. హెచ్‌సీఏలో జరిగిన అవినీతి, నిధుల దుర్వినియోగం, రాజకీయ ప్రమేయం వంటి అంశాలపై తేలికగా వదలే పరిస్థితి కాదనిపిస్తోంది.
More Stories
ఆయుర్వేద పద్ధతులను, యోగాను అణచి వేసే కుట్ర
లొంగిపోయిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు సుజాతక్క
17 నుంచి `సేవా పక్షం అభియాన్’గా మోదీ జన్మదినం