సైబర్ మోసగాళ్ల నుంచి రూ.5489 కోట్ల స్వాధీనం

సైబర్ మోసగాళ్ల నుంచి రూ.5489 కోట్ల స్వాధీనం
సైబర్ మోసగాళ్ల నుంచి ఇప్పటి వరకు రూ.5489 కోట్లను రికవరీ చేసినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. ఆ సొమ్మును బాధితులకు రీఫండ్ చేసేలా నిబంధనలను సులభతరం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన కేసుల్లో సైబర్ కమాండోల సేవలను సమర్థంగా వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు.

న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్ లోని తన కార్యాలయంలో సైబర్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ డివిజన్ (సిఐఎస్) కార్యకలాపాలను కేంద్ర మంత్రి సంజయ్‌ సమీక్షించారు. సైబర్ నేరాలపై పోరాటంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం కల్పించే ప్రధాన కేంద్రంగా ఐ4సీ పనిచేస్తోందని తెలిపారు. కాగా, 12 లక్షలకుపైగా సిమ్‌లు/మొబైల్ హ్యాండ్‌సెట్లను బ్లాక్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. 

అలాగే రూ.4631 కోట్లు విలువైన మోసపూరిత లావాదేవీలను అడ్డుకోవడం జరిగిందని, అందులో భాగంగా 13.3 లక్షల మ్యూల్ అకౌంట్లను (సైబర్ మోసాల్లో డబ్బు తరలించడానికి వాడే బ్యాంకు ఖాతాలు) ఫ్రీజ్ చేసినట్లు వివరించారు.

ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4సి)లో భాగంగా జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్ సి ఆర్ పి), 1930 – సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (సిఎఫ్ సీఆర్ఎంఎస్), సైబర్ మల్టీ ఏజన్సీ సెంటర్ (సైమక్), రిపోర్ట్ & చెక్ సస్పెక్ట్ సౌకర్యం, సస్పెక్ట్ రిజిస్ట్రీ, సమన్వయ్ ప్లాట్‌ఫాం, సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్, సైబర్ కమాండోల ద్వారా విస్తృత సేవలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

కేంద్ర, రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాల పోలీస్ సిబ్బంది, న్యాయవాదులు, న్యాయమూర్తుల సామర్థ్యాల అభివృద్ధికి సైతం పలు కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అలాగే సోషల్ మీడియా, పత్రికలు, ప్రసార భారతి, ఆకాశవాణి ద్వారా సైబర్ మోసాలపై ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అందులో భాగంగా 1930 పేరుతో సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ హెల్ప్‌లైన్ ను ఏర్పాటు చేసినట్లు వివరించారు.