ఎన్డీఏ ఉప రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా సీపీ రాధాకృష్ణ‌న్‌

ఎన్డీఏ ఉప రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా సీపీ రాధాకృష్ణ‌న్‌

ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తమిళనాడు బీజేపీ సీనియర్‌ నేత సీపీ రాధాకృష్ణన్ను నియామించినట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు. ప్రస్తుతం రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. గతంలో ఆయన ఝార్ఖండ్, తెలంగాణ గవర్నర్‌గా పనిచేశారు. కోయంబత్తూర్‌ నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్‌కు ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యంతో పాటు రాజకీయాల్లో విశేష అనుభవం ఉంది.  

ఉప రాష్ట్రపతి ఎన్నిక విషయంలో తాము విపక్షాలతో కూడా సంప్రదిస్తున్నామని, ఉప రాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సహకరించాలని వారిని కోరుతున్నామని జేపీ నడ్డా తెలిపారు.  పార్లమెంట్‌ ఉభయ సభల్లో 786 మంది సభ్యులుండగా, ఉప రాష్ట్రపతిగా ఎన్నిక కావడానికి కనీసం 394 ఓట్లు అవసరం. అయితే ఎన్డీఏ కూటమికి రెండు సభల్లో కలిపి 422 ఓట్లు ఉన్నాయి. దీంతో ఆ అభ్యర్థి ఎన్నిక నల్లేరు మీద బండిగా భావిస్తున్నారు.

ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్‌ 1957, అక్టోబర్‌ 20న తమిళనాడులోని తిరుప్పూర్‌లో జన్మించారు. తమిళనాడులో ప్రభావవంతమైన గౌండర్‌ సామాజిక వర్గానికి చెందిన ఈ ఓబీసీ నేతకు ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యంతో పాటు రాజకీయాల్లో సుమారు 40 ఏండ్ల అనుభవం ఉంది. తమిళనాడు మోదీగా ఆయనను పిలుస్తారు.

1957 మే 4న జన్మించిన సీపీ రాధాకృష్ణన్‌ తమిళనాడులోని కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి 2సార్లు బీజేపీ తరుఫున ఎంపీగా ఎన్నికయ్యారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ ఆయన సేవలు అందించారు. 2016 నుంచి 2019 వరకు ఆల్‌ ఇండియా కాయర్‌ బోర్డ్‌ ఛైర్మన్‌గా పనిచేశారు.  ఈ విధంగా ఆయన తమిళనాడు బీజేపీ సీనియర్‌ నాయకుల్లో ఒకరిగా మంచి గుర్తింపు పొందారు. 2023 ఫిబ్రవరి 18 నుంచి ఝార్ఖండ్‌ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ బాధ్యతలు చేపట్టారు.

గతంలో ఆయన తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గానూ అదనపు బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేస్తున్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే అధికారాన్ని ఎన్డీఏ పక్షాలు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అప్పగించిన సంగతి తెలిసిందే. ఉపరాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్‌ దాఖలుకు ఈ నెల 21 చివరి తేదీ. కాగా, ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థిని పోటీకి దింపేందుకు సోమవారం కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే కార్యాలయంలో సమావేశం కానున్నట్టు ఇండియా కూటమి తెలిపింది.

ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన సీపీ రాధాకృష్ణన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. రాధాకృష్ణన్‌ గౌరవప్రదమైన రాజకీయ నాయకుడు, హుందాతనం కలిగిన నాయకునిగా మంచి పేరు ఉందని సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా సీఎం రాసుకొచ్చారు. అత్యుత్తమంగా సుదీర్ఘకాలం ఆయన దేశానికి సేవ చేశారని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ తరపున ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరచడమే కాకుండా పూర్తిగా మద్దతును తెలియజేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.

 
మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌‌‌ను ఎన్డీఏ తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. 40 సంవత్సరాలకు పైగా తన విశిష్టమైన జీవితంలో, కోయంబత్తూరు నుంచి రెండుసార్లు ఎంపీగా, జార్ఖండ్ మాజీ గవర్నర్‌గా, ఇప్పుడు మహారాష్ట్ర గవర్నర్‌గా ఆయన అద్భుతమైన ప్రయాణం అంకితభావం, దార్శనిక నాయకత్వాన్ని ప్రతిబింబిస్తుందని పవన్ కళ్యాణ్ కొనియాడారు.