
ఆంధ్రప్రదేశ్‌లో నిర్మిస్తున్న జాతీయ ప్రాజెక్టు పోలవరం డ్యామ్‌లో మరోసారి నాణ్యతా లోపం బయటపడింది. అప్పర్ కాఫర్ డ్యామ్ మరోసారి కుంగిపోయింది. దాదాపు 10 అడుగుల వెడల్పు, 8 అడుగుల లోతున ధ్వంసం అయినట్టు అధికారులు తెలిపారు. గతంలో 2022లోనూ ఇదేవిధంగా కాఫర్‌డ్యామ్ దెబ్బతిన్నది. అంతకుముందు ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది.
వాస్తవానికి పోలవరం కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టే అయినా రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ పనులు చేస్తుండగా, కేంద్రం నిధుల సాయం చేస్తున్నది. ఏపీ ప్రభుత్వం దాదాపు 194 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్టును చేపట్టింది. నిర్మాణ ప్రణాళికలో భాగంగా తొలుత గోదావరి ప్రవాహాన్ని మళ్లించేందుకు ఎగువన, దిగువన కాఫర్ డ్యామ్‌లు నిర్మించాల్సి ఉన్నది.
ఆ తర్వాత ప్రధాన డ్యామ్, డయాఫ్రం వాల్ నిర్మించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో 28లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని అడ్డుకునేందుకు వీలుగా 2.1 కిలోమీటర్ల పొడవుతో, 31 మీటర్ల ఎత్తుతో ఎగువ కాఫర్‌డ్యామ్‌ను నిర్మించాలని ముందుగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆ తర్వాత దాని ఎత్తును 41.5 మీటర్లకు పెంచారు. అయితే అప్పర్ కాఫర్ డ్యామ్‌ను ఇష్టారాజ్యంగా నిర్మించారు. 2.1 కిలోమీటర్ల పొడవైన డ్యామ్‌లో ఒకచోట 380 మీటర్లు, మరోచోట 300 మీటర్ల గ్యాప్ వదిలారు.
2020లో వచ్చిన గోదావరి భారీ వరదలకు డయాఫ్రమ్ వాల్ 3 చోట్ల దెబ్బతిన్నది. ఒక చోట 200మీటర్ల మేర వాల్ కొట్టుకుపోయింది. అనేక చోట్ల డీవాల్ ఇసుక కోతకు గురై అగాథాలు ఏర్పడ్డాయి. ఎగువన కాఫర్ డ్యామ్‌ను నిర్మించకపోవడం వల్లే ప్రమాదం జరిగింది. డీ వాల్ దెబ్బతినడంతో దాదాపు రూ.500కోట్ల నష్టం వాటిల్లింది. ఈసీఆర్‌ఎఫ్ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఆ తర్వాత కాఫర్‌డ్యామ్‌ను మరింత ఎత్తు పెంచారు.
తాజాగా 10 అడుగుల వెడల్పు, 8 అడుగుల లోతున కాఫర్ డ్యామ్ ధ్వంసమైంది. నాణ్యత లోపం కారణంగా గతంలో దెబ్బతిన్న ప్రాంతంలోనే ఇప్పుడు కూడా కాఫర్‌డ్యామ్ దెబ్బతిన్నదని భావిస్తూ ఉండడంతో పోలవరం డ్యామ్ భద్రతే ప్రశ్నార్థకంగా మారింది. కేంద్ర ప్రభుత్వం, జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ నిపుణులు పరిశీలించి పోలవరం భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది.
కాగా, సీపేజ్ నివారణకు విదేశీ నిపుణుల బృందం సిఫార్సు మేరకు ఎగువ కాఫర్ డ్యాం పొడవునా బట్రస్ డ్యాం నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. జారిన భాగాన్ని పునరుద్ధరించామని, బట్రస్ డ్యాం ఉండడం వల్ల ఎలాంటి సమస్య ఉండదని ఇంజనీరింగ్ చీఫ్ నరసింహమూర్తి తెలిపారు. ఈ విషయంపై పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో ఇంజనీరింగు అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు