
చైనా విదేశాంగ శాఖా మంత్రి వాంగ్‌యి ఆగస్టు 18 నుండి 20 వరకు భారత్‌లో మూడు రోజులపాటు పర్యటిస్తారని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి శనివారం వెల్లడించారు. చైనా, భారత్ సరిహద్దు సమస్యపై ప్రతినిధులతో వాంగ్‌యి 24వ రౌండ్ చర్చలు జరపనున్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆహ్వానం మేరకు చైనా విదేశాంగ శాఖా మంత్రి వాంగ్ యి భారత్‌ను సందర్శించనున్నారు.
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సిపిసి) కేంద్ర కమిటీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు, సరిహద్దు ప్రశ్నపై చైనా ప్రత్యేక ప్రతినిధి అయిన వాంగ్ యి ఈ పర్యటనలో భారత్ – చైనా సరిహద్దు ప్రశ్నలపై 24వ రౌండ్ ప్రత్యేక ప్రతినిధుల (ఎస్ఆర్) చర్చలను దోవల్‌తో నిర్వహిస్తారు. ఈ పర్యటనలో వాంగ్‌యి భారత విదేశాంగ శాఖా మంత్రి ఎస్. జై శంకర్‌తో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై కూడా చర్చించనున్నట్లు ఆ ప్రకటన పేర్కొంది.
2020లో సరిహద్దులో భారత, చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణ తర్వాత ఇరు దేశాధినేతలు చర్చించుకోవడం ఇది రెండోసారి. ఇదిలా ఉండగా, మరోవైపు ఈ నెల చివరలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో పర్యటించనున్నారు.
ఈ పర్యటనను ధృవీకరిస్తూ, భారతదేశంలోని చైనా రాయబారి జు ఫీహాంగ్ ఎక్స్ లో ఇలా పోస్ట్ చేశారు: “ఆగస్టు 18 నుండి 20 వరకు, సిపిసి సెంట్రల్ కమిటీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు, విదేశాంగ మంత్రి , చైనా-భారత్ సరిహద్దు సమస్యపై చైనా ప్రత్యేక ప్రతినిధి వాంగ్ యి భారతదేశాన్ని సందర్శించి, భారత వైపు ఆహ్వానం మేరకు సరిహద్దు సమస్యపై చైనా, భారతదేశంల ప్రత్యేక ప్రతినిధుల మధ్య 24వ రౌండ్ చర్చలు నిర్వహిస్తారు.”
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైన వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు