ధర్మవరంలో పాక్ ఉగ్రవాదులతో చాట్ చేస్తున్న యువకుడి అరెస్ట్

ధర్మవరంలో పాక్ ఉగ్రవాదులతో చాట్ చేస్తున్న యువకుడి అరెస్ట్
ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లాలో ఉగ్రవాదుల కదలికలు కలకలం సృష్టించాయి. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఎన్ఐఏ అధికారులు ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతను పాకిస్థాన్‌కు ఫోన్లు చేస్తూ, ఉగ్రవాదులతో చాటింగ్ చేస్తున్నాడని సమాచారం. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలపై నిఘా పెట్టిన ఎన్ఐఏకు ధర్మవరంలోని కోట కాలనీలో నివాసం ఉంటున్న నూర్‌పై అనుమానం వచ్చింది.
 
నూర్ ధర్మవరంలోని కోట వీధిలో గల ఓ హోటల్‌లో వంటమనిషిగా పనిచేస్తూ, బయటికి సాధారణ జీవితాన్ని నడిపిస్తున్నట్లే కనిపించినా, ఉగ్రవాద సంస్థలతో ఆయనకు సంబంధాలున్నాయని ఎన్ఐఏ అనుమానిస్తోంది. నూర్‌ను రెండు రోజుల క్రితం ఎన్ఐఏ అధికారులు రహస్యంగా అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుండి ఆయనను రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం.
 
నూర్‌ మహమ్మద్‌ ఇంటిని స్థానిక పోలీసులతో కలిసి ఎన్‌ఐఎ, ఐబీ అధికారులు శుక్రవారం రాత్రి తనిఖీలు చేశారు. అతని ఇంట్లో పలు అనుమానిత వస్తువులు, వివిధ రకాల సిమ్‌ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.  నూర్‌ మహమ్మద్‌ వాట్సాప్‌ ద్వారా పాకిస్థాన్‌కు ఫోన్‌ కాల్స్‌ చేస్తూ అక్కడి తీవ్రవాదులతో ఛాటింగ్‌ చేస్తున్నట్లు సమాచారం.  అతడి ఇంట్లో జరిపిన సోదాల్లో ఏకంగా 16 సిమ్ కార్డులు బయటపడ్డాయి. అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. నూర్ సోషల్ మీడియా ఖాతాలపై నిఘా ఉంచారు. 
ఉగ్రవాదులతో నూర్‌కు ఉన్న సంబంధాలపై మరింత లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ ఆపరేషన్‌ను ఎన్‌ఐఏ అత్యంత గోప్యంగా నిర్వహించింది.  గతంలో జరిగిన ఉగ్రవాద కేసుల విచారణలో భాగంగా, ధర్మవరంలో నూర్‌కు టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. పక్కా సమాచారంతో, అత్యంత గోప్యంగా ఈ ఆపరేషన్‌ను నిర్వహించి నూర్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరింత సమాచారం సేకరించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన ధర్మవరం ప్రాంతంలో భయాందోళనలకు దారితీసింది.
 
కాగా, అన్నమయ్య జిల్లా రాయచోటిలో కూడా గత నెలలోనే ఉగ్రవాదుల్ని ఐబి, ఎన్ఐఏ అరెస్ట్ చేయడం తెలిసిందే. తమిళనాడులో బాంబు పేలుళ్ల కేసులో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు అబూబకర్ సిద్ధిఖి, మహమ్మద్ మన్సూరు అలీని ఐబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఐబీ అధికారులు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు వారి ఇళ్లలో సోదాలు చేశారు. 
 
ఈ సోదాల్లో పేలుడు పదార్థాలు, బకెట్ బాంబులు, సూట్‌కేస్ బాంబులు దొరికాయని సమాచారం. తమిళనాడులో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో వీరు చాలా కాలంగా మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు. అబూబకర్ సిద్ధిఖి, మహమ్మద్ మన్సూరు అలీ రాయచోటిలో 30 ఏళ్లుగా ఉంటున్నారని పోలీసులు తెలిపారు. ఈ విషయం స్థానికంగా కలకలం రేపింది.