ఒప్పందం లేకుండానే ముగిసిన ట్రంప్‌, పుతిన్‌ భేటీ

ఒప్పందం లేకుండానే ముగిసిన ట్రంప్‌, పుతిన్‌ భేటీ

ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, రష్యా అధినేత వ్లాదిమిర్‌ పుతిన్‌ కీలక భేటీ అసంపూర్తిగా ముగిసింది. ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపే దిశగా అలస్కా వేదికగా ఇరువురు దేశాధినేతల సమావేశం ఉంటుందని అంతా అనుకున్నప్పటికీ ఎలాంటి ఒప్పందం కుదరకుండానే చర్చలు ముగిశాయి. సుమారు 3 గంటలపాటు వీరి సమాచవేశం జరిగింది. 

భేటీ అనంతరం ఇరువురు నేతలు భేటీ వివరాలను వెల్లడించారు. సమావేశం ఫలప్రదమైందని, భేటీలో అనేక అంశాలపై చర్చించామని ట్రంప్ తెలిపారు. తమ చర్చల్లో ఎంతో పురోగతి లభించిందని, అయితే కొన్ని సమస్యలను ఇంకా పరిష్కరించుకోవాల్సి ఉందని చెప్పారు. తుది ఒప్పందం మాత్రం కుదరలేదని వెల్లడించారు. చాలా అంశాలను ఇద్దరం అంగీకరించామని, అయితే కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయని పేర్కొన్నారు. 

అన్ని విషయాలను పరిష్కరించుకొని అధికారికంగా ఒప్పందంపై సంతకం చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. త్వరలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, ఈయూ నేతలతో మాట్లాడతానని చెప్పారు. మళ్లీ పుతిన్‌ను కలుస్తానని చెబుతూ తదుపరి సమావేశం మాస్కోలో ఉంటుందని ప్రకటించారు. అలస్కాలో ట్రంప్‌తో సమావేశం చాలా నిర్మాణాత్మకంగా జరిగిందని వ్లాదిమిర్‌ పుతిన్‌ తెలిపారు. ఉక్రెయిన్‌ యుద్ధం ప్రధాన అంశంగా చర్చించామని పేర్కొంటూ ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు తాను నిజాయతీగా ఉన్నానని, ఈ సమావేశం వివాదానికి ముగింపు పలకడానికి పునాది అని వెల్లడించారు. ఈ సందర్భంగా ట్రంప్‌నకు ధన్యవాదాలు తెలిపారు. 

ఉక్రెయిన్ భద్రత కూడా నిర్ధరించాలని భేటీలో ట్రంప్​ చెప్పిన విషయాన్ని తాను అంగీకరిస్తున్నట్లు పుతిన్ తెలిపారు. తాము దాన్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఉక్రెయిన్ తమకు సోదర దేశమని, మూలాలు ఒకటేనని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి తమ భద్రతకు ప్రాథమిక ముప్పుగా ఉందని, జరుగుతున్న ప్రతిదీ విషాదమని, భయంకరమైన గాయమని చెప్పారు.

యూరోపియన్ యూనియన్ దేశాలు, రష్యా మధ్య దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడానికి న్యాయమైన అధికార సమతుల్యతను నెలకొల్పాలని కోరుకుంటుందని పుతిన్ వెల్లడించారు. పరిష్కారం శాశ్వతంగా, దీర్ఘకాలికంగా ఉండాలంటే, ఘర్షణకు గల అన్ని ప్రాథమిక కారణాలను తొలగించాల్సిన అవసరం ఉందని నమ్ముతున్నట్లు చెప్పారు. రష్యా అన్ని చట్టబద్ధమైన అడ్డంకులను పరిగణనలోకి తీసుకుని, మొత్తం ప్రపంచంలో న్యాయమైన భద్రతా సమతుల్యతను పునరుద్ధరించాలని ఇప్పటికే చెప్పినట్లు గుర్తుచేశారు.

ట్రంప్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతూ ఇరుదేశాల మధ్య సంబంధాల విషయాలలో క్లిష్టకాలంలో అధ్యక్షుడు ట్రంప్‌తో మాస్కో మంచి సంబంధాలు ఏర్పరచుకున్నదని చెప్పారు. ఉక్రెయిన్‌పై ట్రంప్‌ , తాను ఒక అవగాహనకు వచ్చామని పేర్కొంటూ చర్చల పురోగతిని దెబ్బతీయవద్దని ఈయూని హెచ్చరించారు. 2022లో ట్రంప్‌ అధికారంలో ఉండి ఉంటే ఉక్రెయిన్‌తో రష్యాకు యుద్ధం వచ్చి ఉండేది కాదని పుతిన్‌ పునరుద్ఘాటించారు. తదుపరి సమావేశం కోసం ట్రంప్‌ను మాస్కోకు రావాల్సిందిగా పుతిన్‌ ఆహ్వానించారు.