రోజుకు 2 మిలియన్ బ్యారేళ్లు పెరిగిన రష్యా చమురు

రోజుకు 2 మిలియన్ బ్యారేళ్లు పెరిగిన రష్యా చమురు
* అమెరికా నుండి 20 బ్యారెళ్ల ముడి చమురును ఇండియన్ ఆయిల్ ఆర్డర్

రష్యా నుండి భారత్ చమురు కొనుగోలు చేస్తుందని మండిపడుతూ ఒకవంక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై 50 శాతం సుంకాలను పెంచగా, అదే సమయంలో ఆగస్టులో రష్యా నుండి చమురు కొనుగోళ్లు రోజుకు 2 మిలియన్‌ బ్యారెళ్లకు (బిడిపి) పెరగడం గమనార్హం. ఆగస్టు మొదటి అర్థభాగంలో రోజుకి దిగుమతి చేసుకున్న 5.2 మిలియన్‌ బ్యారెళ్ల ముడి చమురులో 38శాతం రష్యా నుండి వచ్చిందని గ్లోబల్‌ రియల్‌ టైమ్‌ డేటా అనలిటిక్స్‌ సంస్థ కెప్లర్‌ తెలిపింది.

వాస్తవానికి జులైలో రష్యా నుండి దిగుమతులు రోజుకి 16 మిలియన్‌ బ్యారెళ్లు ఉండగా, ఆగస్టు నాటికి 2 మిలియన్‌ బ్యారెళ్లకు పెరిగాయి. ఆగస్టులో ఇరాక్‌నుండి దిగుమతి అయ్యే చమురు తగ్గించుకోవడంతో ఆ మేరకు రష్యా నుండి దిగుమతులు పెరిగాయని కెప్లర్‌ విశ్లేషకులు సుమిత్‌ రిటోలియా తెలిపారు. ఆగస్టులో ఇరాక్‌ నుండి 7,30,000 బ్యారెళ్లకు తగ్గగా, సౌదీ అరేబియా నుండి 5,26,000 బ్యారెళ్లకు తగ్గాయి.  2,64,000 బ్యారెళ్లతో అమెరికా ఐదవ అతిపెద్ద సరఫరాదారుగా ఉంది. 

జులై చివరలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ టారిఫ్‌లు ప్రకటించిన తర్వాత కూడా, ఆగస్టులో రష్యా నుండి భారత్‌లోకి ముడి చమురు దిగుమతులు ఇప్పటివరకు స్థిరంగానే కొనసాగుతున్నాయని సుమిత్‌ రిటోలియా తెలిపారు. ఈ ఆర్డర్లు జూన్‌, జులై మొదటి వారంలో పెట్టినవని అన్నారు. రష్యా నుండి ముడి చమురు కొనుగోళ్లు తగ్గించాలని ప్రభుత్వం ఆదేశించలేదని పేర్కొన్నారు. భారత్‌లోని శుద్ధి కర్మాగారాలు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయని రిటోలియా చెప్పారు. 

అయితే, సుంకాల కారణంగా చెల్లింపుల్లో సమస్యలు, షిప్‌మెంట్‌లో ఇబ్బందులు, పాలసీ మార్పులు వంటి వాటి ప్రభావం సెప్టెంబర్‌, అక్టోబర్‌లో కనిపించవచ్చని తెలిపారు. అమెరికా టారిఫ్‌ల తర్వాత రష్యా నుండి కొనుగోళ్లను నెమ్మదించాలని ప్రభుత్వం ఎలాంటి సూచన చేయలేదని భారతదేశ అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌ చైర్మన్‌ అరవిందర్‌ సింగ్‌ సాహ్నే కూడా ప్రకటించారు. 

రష్యా ముడి చమురు వాటాను పెంచడానికి లేదా తగ్గించడానికి యత్నించడం లేదని అన్నారు. ఏప్రిల్‌, జూన్‌లో ఐఒసి ప్రాసెస్‌ చేసిన ముడి చమురులో రష్యా చమురు సుమారు 22శాతం వాటా కలిగి వుందని, భవిష్యత్తులో అదేవిధంగా కొనసాగవచ్చని తెలిపారు. రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించుకొన్నట్లు భారత్‌ పెట్రోలియం కార్పోరేషన్‌ లిమిటెడ్‌ (బిపిసిఎల్‌) డైరెక్టర్‌ రామకఅష్ణ గుప్తా వెల్లడించారు. డిస్కౌంట్‌ తగ్గిన కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.

మరోవంక, అమెరికా నుంచి ముడి చమురు దిగుమతులను భారత్ పెద్దగా పెంచుతోంది. భారతదేశంలో అతిపెద్ద చమురు సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), ఈ ఆగస్టులో 20 లక్షల బ్యారెళ్ల ముడి చమురు కోసం అమెరికాకు ఆర్డర్ వేసింది. ఈ చమురు అక్టోబర్ నాటికి భారత్‌కు చేరనుంది.భారత ప్రభుత్వం ఇప్పటివరకు ఇరాక్, సౌదీ అరేబియా వంటి దేశాలపైనే ఆధారపడింది. కానీ, ఇప్పుడు వైవిధ్యమైన దిగుమతి మార్గాలపై దృష్టి పెట్టడంలో భాగంగానే అమెరికా వైపు అడుగులు వేస్తోంది.