
వాతావరణ మార్పులతో ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మానవాళికి త్వరలోనే మరో ముప్పు ఎదురవ్వనుంది. ఏడాదికేడాది పెరిగిపోతున్న భూతాపం కారణంగా హిమాలయ ప్రాంతంలోని మంచు వేగంగా కరుగుతోంది. ఫలితంగా భారీగా వరదలు సంభవించే అవకాశముందని అడ్వాన్సింగ్ ఎర్త్ స్పేస్ సైన్స్ (ఏజిఎస్) అధ్యయనం హెచ్చరిస్తోంది.
గత పదేళ్లుగా అక్కడి గ్లేషియర్స్ పరిమాణం తగ్గుతూ వస్తోందని ఇది భవిష్యత్‌లో తీవ్ర విపత్తులకు దారి తీయనుందని ఏజీయూ అధ్యయనం పేర్కొంది. ఫలితంగా అక్కడి సింధు, యాంగ్జే, అము డార్యా, సిర్ దర్యా వంటి నదుల్లో పది శాతం నీటి పరిమాణం పెరిగిందని వెల్లడించింది.
హిమాలయ ప్రాంతంలోని మంచుపై కాలుష్యం ప్రభావం – మానవాళిపై దాని దుష్ఫరిణామాలపై ఏజీయూ పరిశోధకులు అధ్యయనం చేశారు. హిమాలయ ప్రాతంలోని నదీ వ్యవస్థలో చోటుచేసుకుంటున్న మార్పులను నోట్ చేశారు. వీళ్ల స్టడీ ప్రకారం 2100 నాటికి హిమానీనదాల శాతం 29 నుంచి 67 శాతం వరకూ తగ్గే అవకాశముందని పరిశోధకులు చెబుతున్నారు.
క్లోరోఫ్లోరో కార్బన్‌ల కారణంగా భూతాపం పెరుగుతుండడం వల్ల మంచు కరిగి నదుల్లో నీటి శాతం ఎక్కువవుతోంది. ఫలితంగా నదీ తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు, లోతట్టు ప్రాంతాల్లో నివసించేవారు తీవ్ర దుష్ఫరిణామలు ఎదుర్కోంటారని ఏజీయూ పరిశోధకులు అంటున్నారు. కాగా, ప్రపంచంలోని ఎత్తైన శిఖరాలు ఈ శతాబ్దం చివరి నాటికి వాటి పరిమాణంలో 80 శాతం వరకు కోల్పోయే ప్రమాదం ఉందని, దారుణమైన వాతావరణ పరిస్థితులలో లక్షలాది మంది ప్రజలపై తీవ్ర పరిణామాలు ఉంటాయని నేపాల్‌లోని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు రెండేళ్ల క్రితం ఓ నివేదికలో హెచ్చరించారు.
ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్‌మెంట్ (ఐఐసిఎంఓడి) ప్రచురించిన ఈ నివేదిక హిందూ కుష్, హిమాలయ పర్వత శ్రేణి ప్రాంతంలోని హిమానీనదాలు 2010లలో మునుపటి దశాబ్దంతో పోలిస్తే 65 శాతం వేగంగా కరిగిపోయాయని కనుగొంది. ఇది ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలు ప్రభావాన్ని చూపుతున్నాయని సూచిస్తుంది.
హిమాలయ ప్రాంతంలో నివసించే 240 మిలియన్ల మందికి, పర్వతాలలో ఉద్భవించే 12 నదుల దిగువన నివసించే మరో 1.65 బిలియన్ల మందికి కూడా మంచినీటి లభ్యత ప్రభావితమవుతుందని పేర్కొంది. “గ్లోబల్ వార్మింగ్‌కు దాదాపుగా దోహదపడని ఈ పర్వతాలలో నివసించే ప్రజలు వాతావరణ మార్పుల కారణంగా అధిక ప్రమాదంలో ఉన్నారు” అని వలస నిపుణురాలు, నివేదిక రచయితలలో ఒకరైన అమీనా మహర్జన్ తెలిపారు.
More Stories
అడ్డంకుల తొలగింపుకు చర్చలకు ట్రంప్, మోదీ సుముఖం!
రాహుల్ గాంధీ మలేసియా `విహార యాత్ర’పై దుమారం
నిరసనలతో రగిలిపోతున్న నేపాల్… రంగంలోకి సైన్యం