
జమ్ముకశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్‌లో కుంభవృష్టి కారణంగా సంభవించిన జల ప్రళయం విపత్తులో మృతుల సంఖ్య 52 నుంచి 65 కి చేరింది. 100 మంది కన్నా ఎక్కువ మంది గాయపడ్డారు. దాదాపు 200 మంది గల్లంతయ్యారు. మృతుల్లో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది .సంఘటన జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. సైన్యం కూడా రంగంలోకి దిగింది.
ఇప్పటివరకు 30 మృతదేహాలను అధికారులు గుర్తించారు. 190 మందిని రక్షించినట్టు తెలుస్తోంది. ఈ విపత్తులో 500 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకున్నట్టు భావిస్తున్నానని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా వెల్లడించారు. కొందరు అధికారులు ఈ సంఖ్య 1000 వరకు దాటొచ్చని చెబుతున్నారని, ఇది తీవ్ర విషాదకరమైన క్షణం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాలతో ఈ విపత్తు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానితో ముఖ్యమంత్రి మాట్లాడుతూ చొసితి గ్రామానికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తానని చెప్పారు. దీనిపై ప్రధాని తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. “జమ్ము కశ్మీర్ ఎల్జి, ముఖ్యమంత్రి ఒమర్ లతో మాట్లాడాను. అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు ” అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన ఎక్స్‌ఖాతాలో పోస్టు పెట్టారు. “ ఇప్పుడే ప్రధాని మోదీతో మాట్లాడాను. కిశ్త్‌వాడ్ లోని పరిస్థితుల గురించి వివరించాను. ఆయన మద్దతు, సాయానికి తమ ప్రభుత్వం, బాధిత ప్రజలు ఎంతో రుణపడి ఉండారు ” అని పేర్కొన్నారు.
మృతులను గుర్తించడానికి అధికార యంత్రాంగం అనేక ప్రయత్నాలు చేస్తోంది. వారి ఫోటోలను వాట్సాప్‌ల ద్వారా వారి కుటుంబాలకు పంపిస్తోంది. ఫలితంగా ఇంతవరకు 30 మందిని గుర్తించే వీలు కలిగింది. రక్షించబడిన 160 మందిలో 38 మంది పరిస్థితి క్లిష్టంగా ఉంది. ప్రమాదస్థలం చోసితికి 15 కిమీ దూరంలో పడ్డార్ వద్ద అధికార యంత్రాంగం యాత్రికుల సహాయంగా కంట్రోల్ రూమ్ హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూమ్‌లో ఐదుగురు అధికారులు నిరంతరం పనిచేస్తున్నారు.
More Stories
హజారీబాగ్‌లో ముగ్గురు కీలక మావోయిస్టులు మృతి
జైళ్ల కంటే దారుణంగా బెగ్గర్స్ హోమ్స్
గృహ నిర్మాణం ప్రాథమిక హక్కు