కశ్మీర్‌లో జల బీభత్సం.. 52 మంది మృతి, 200 మంది గల్లంతు

కశ్మీర్‌లో జల బీభత్సం.. 52 మంది మృతి, 200 మంది గల్లంతు
ఉత్తరాఖండ్‌లోని ధరాలీలో జల విలయాన్ని మరువక ముందే జమ్ము కశ్మీర్‌లో మరో ఘోర విషాదం చోటుచేసుకుంది. కిష్టార్‌ జిల్లాలో గురువారం కురిసిన ఆకస్మిక కుంభవృష్టికి ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లతోసహా 52 మంది మరణించగా 160 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో 38 మంది పరిస్థితి విషమంగా ఉన్నది. మరో 200 మంది వరకు గల్లంతయ్యారు. 
 
మారుమూల పర్వత ప్రాంతంలోని ఓ గ్రామంపై మేఘ విస్ఫోటం సంభవించి గ్రామాన్ని వరద ముంచెత్తినట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన వారిని రక్షించేందుకు సహాయక బృందాలు గాలిస్తున్నాయి. మచైల్‌ మాతాదేవి యాత్రకు వెళ్లే మార్గంలో వాహనాలు వెళ్లగల చివరి గ్రామం చోసిటీని కుంభవృష్టి ముంచెత్తినట్లు అధికారులు చెప్పారు. 
 
హిమాలయ పర్వత శ్రేణుల్లో కొలువై ఉన్న చండీమాత ఆలయంలో జరుగుతున్న వార్షిక మచైల్‌ మాత యాత్రలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు చోసిటీ గ్రామానికి చేరుకున్నపుడు ఈ ఘటన జరిగింది. ఆకస్మిక వరదలు ముంచెత్తినట్లు సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు చోసిటీ గ్రామాన్ని చేరుకున్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు కృషి చేస్తున్నాయి. 
 
మేఘ విస్ఫోటం జరిగిన ప్రదేశంలో దాదాపు దాదాపు 1,200 మంది ఉన్నట్లు జమ్ము కశ్మీరు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సునీల్‌ శర్మ తెలిపారు. యాత్ర ప్రారంభమయ్యే చోసిటీ గ్రామం నుంచి యాత్రికులను సహాయక బృందాలు హుటాహుటిన తరలించాయి. కిష్టార్‌ ప్రాంతంలో పరిస్థితి గురించి కేంద్ర హోం మంత్రికి వివరించినట్లు జమ్ము కశ్మీరు ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా తెలిపారు. ఘటన జరిగిన ప్రదేశం నుంచి సమాచారం రావడంలో జాప్యం జరుగుతోందని ఆయన చెప్పారు.  సహాయక చర్యల కోసం జమ్ము కశ్మీరు వెలుపలి నుంచి వనరులను సమీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు.

చండీమాత ఆలయంలో జరుగుతున్న మచైల్‌ మాత వార్షిక ఉత్సవాలు జూలై 25న ప్రారంభమై సెప్టెంబర్‌ 5న ముగియనున్నాయి. సముద్ర మట్టానికి 9,500 అడుగుల ఎత్తున ఉన్న చండీ మాత ఆలయానికి చేరుకోవాలంటే చోసిటీ నుంచి 8.5 కిలోమీటర్లు కాలినడక కొండబాట పట్టాల్సి ఉంటుంది. కిష్టార్‌ పట్టణానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న చోసిటీలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన సామూహిక వంటశాల ఆకస్మిక వరదల కారణంగా కొట్టుకుపోయింది. 

దుకాణాలు, సెక్యూరిటీ ఔట్‌పోస్టుతోసహా అనేక కట్టడాలు కొట్టుకుపోయాయి. ఉత్తరాఖండ్‌లోని ఉత్రకాశీ జిల్లా ధరాలీ గ్రామంపై ఆకస్మిక వరదలు ముంచెత్తిన 9 రోజుల తర్వాత చోసిటీలో తాజా ఘటన చోటుచేసుకుంది. ధరాలీ ఘటనలో ఒక వ్యక్తి మాత్రమే మరణించినట్లు అధికారికంగా ప్రకటించినప్పటికీ 68 మంది వ్యక్తుల జాడ ఇప్పటివరకు తెలియరాలేదు.