ఆపరేషన్‌ సిందూర్‌ అధికారులకు గ్యాలంటరీ అవార్డులు

ఆపరేషన్‌ సిందూర్‌ అధికారులకు గ్యాలంటరీ అవార్డులు

79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 16 మంది సరిహద్దు భద్రతా దళ (బిఎస్ఎఫ్) సిబ్బందికి వారి ధైర్యసాహసాలు, అజేయమైన ధైర్యం, విధి పట్ల అంకితభావానికి కేంద్ర ప్రభుత్వం శౌర్య పతకాలను ప్రకటించింది. ఈ సైనికులందరూ పాకిస్తాన్‌పై భారత్‌ నిర్వహించిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో పాల్గొన్నారు. కొంతమంది సైనికులు శత్రువుల డ్రోన్లపై దాడి చేసి నేలమట్టం చేశారు. బీఎస్‌ఎఫ్‌ 2,290 కిలోమీటర్ల పొడవైన ఇండో-పాక్‌ అంతర్జాతీయ సరిహద్దులో గస్తీ నిర్వహిస్తుంది.

పశ్చిమ భాగంలో నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వద్ద సైన్యంతో పాటు బీఎస్ఎఫ్‌ను మోహరించింది. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో సిబ్బంది దృఢ సంకల్పం, అచంచల ధైర్యాన్ని ప్రదర్శించారని బీఎస్‌ఎఫ్‌ పేర్కొంది. వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ మార్షల్ నరనందేశ్వర్ తివారీ, వెస్ట్రన్ ఎయిర్ కమాండర్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా, డీజీ ఎయిర్ ఆపరేషన్స్ ఎయిర్ మార్షల్ అవధేష్ భారతితో సహా నలుగురు భారత వైమానిక దళ అధికారులకు ఉత్తమ యుద్ధ సేవా పతకాన్ని ప్రదానం చేయనున్నారు. 

భారత సైన్యంలోని నలుగురు అధికారులకు కీర్తి చక్ర, ఎనిమిది మంది అధికారులకు శౌర్య చక్రను ప్రదానం చేయనున్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఖచ్చితమైన దాడులు చేయడం, మన గగనతలాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషించినందుకు భారత వైమానిక దళానికి చెందిన 13 మంది అధికారులకు ప్రతిష్టాత్మక యుద్ధ సేవా పతకాలను ప్రకటించారు. 

ఎయిర్ వైస్ మార్షల్ జోసెఫ్ సువారెస్, ఏవీఎం ప్రజువల్ సింగ్, ఎయిర్ కమాండర్‌ అశోక్ రాజ్ ఠాకూర్ ఉన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయాలు, సైనిక స్థావరాలను ధ్వంసం చేసిన తొమ్మిది మంది భారత వైమానిక దళ అధికారులకు వీర్ చక్ర అవార్డులను ప్రకటించారు.

ఇది మూడవ అత్యున్నత శౌర్య పతకం. ఈ ఆపరేషన్‌లో భారత వైమానిక దళం కనీసం ఆరు పాకిస్తానీ విమానాలను కూల్చివేసింది. పాకిస్తాన్‌లోని లక్ష్యాలను చేధించే మిషన్లలో పాల్గొన్న ఫైటర్ పైలట్లు పాకిస్తాన్ దాడులను తిప్పికొట్టిన ఎస్-400, ఇతర వైమానిక రక్షణ వ్యవస్థలను అద్భుతంగా నిర్వహించిన అధికారులు, సైనికులు సహా భారత వైమానిక దళానికి చెందిన 26 మంది అధికారులకు, వైమానిక దళ సభ్యులకు వైమానిక దళ పతకం (శౌర్యం) ఎంపిక చేశారు. 

అలాగే, 21 మంది సీబీఐ అధికారులకు విశిష్ట సేవల కింద రాష్ట్రపతి పోలీస్‌ పకతం, మెరిటోరియస్ సర్వీస్ కోసం పోలీస్‌ పతకం ప్రదానం చేయనున్నారు. కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఈ సారి 1,090 మంది పోలీస్‌ సిబ్బంది వివిధ విభాగాల్లో పతకాలను ప్రకటించింది.