
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పటికైనా జైలుకు వెళ్ళక తప్పదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ స్పష్టం చేశారు. జగన్ ను జైలుకు వెళ్లనీయకుండా బిజెపి పెద్దలు అడ్డుకొంటున్నారని అంటూ సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న దుష్ప్రచారం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని జైలుకు పోనీయకుండా బీజేపీ అడ్డుకుంటుందన్న అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. జగన్పై ఉన్న వివిధ కేసులు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నాయి. అయితే, ఎప్పటికైనా జగన్ జైలుకు వెళ్లక తప్పదు” అని తేల్చి చెప్పారు.
`సారధ్యం’ జిల్లాల పర్యటన సందర్భంగా నెల్లూరు జిల్లాలో పర్యటించిన మాధవ్ తొలుత వేదాయపాళెం కూడలి వద్ద చాయ్ పే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆత్మకూరు బస్టాండ్ వద్ద పొట్టిశ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు. వీఆర్సీ మైదానం నుంచి కస్తూరిబా కళాక్షేత్రం వరకు బీజేపీ శ్రేణులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. కస్తూరిబా కళాక్షేత్రంలో జరిగిన బీజేపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ప్రసంగిస్తూ సారధ్యంలో భాగంగా బిజెపి నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటూ, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నానని మాధవ్ తెలిపారు.
గత నెల 27న కడప నుంచి ప్రారంభమై అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ ర్యాలీలతో పార్టీకి వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నానని చెప్పారు. తన పర్యటనలో ప్రముఖ వ్యక్తుల్ని కలవడం, ప్రధాన సమస్యలపై చర్చించి నిర్ణయం తీసుకోవడం, ఆయా ప్రాంతాల్లో ఉన్న మహానుభావుల గురించి పార్టీ కార్యకర్తలకు తెలియజేస్తూ, పార్టీ క్యాడర్ ప్రేరణ పొందేలా కార్యక్రమాలను చేపడుతున్నామని చెప్పారు. ఎక్కడికెళ్లినా పార్టీ కార్యకర్తల్లో, నాయకత్వంలో మంచి స్పందన లభిస్తోందని పేర్కొన్నారు.
ఏపీలో సెమీ కండక్టర్ పరిశ్రమకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రూ. 460 కోట్ల రూపాయలతో ఈ పరిశ్రమ రాష్ట్రానికి గేమ్ చేంజెర్ కాబోతుందని తెలిపారు. రాష్ట్రానికి వివిధ అభివృద్ధి పథకాలకు కేంద్రం నుంచి రూ. 10 లక్షల కోట్లు పెట్టుబడులు రావడం మంచి శుభపరిణామం అని చెప్పారు. తిరుపతిలో ఎలక్ట్రానిక్ పరిశ్రమ, భోగాపురం, అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులు 1,84,000 కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ పరిశ్రమ, విశాఖలో ఆదానీ డేటా సెంటర్, మూలపేట పోర్టు, మచిలీపట్నం పోర్టు, తదితర అభివృద్ధి కార్యక్రమాలతో గుజరాత్ ను దాటి మన రాష్ట్రం అభివృద్ధిని సాధించబోతుందని మాధవ్ భరోసా వ్యక్తం చేశారు.
అంతే కాకుండా దుబాయ్ లో సక్సెస్ అయిన లూ లూ కంపెనీ ద్వారా మెగా మాల్స్, ఇంటర్నేషనల్ స్థాయి కన్వెన్షన్ సెంటర్లు వస్తాయని వివరించారు. పార్టీలో కార్యకర్తలకు నాయకత్వ లక్షణాలు పెంపొందించి, జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే విధంగా కార్యకర్తల్లో చైతన్యం తీసుకొస్తున్నామని చెప్పారు. నెల్లూరు ఎయిర్ పోర్ట్ విషయంలో కొంత జాప్యం జరుగుతుందని చెబుతూ దీనిపై కూడా అధినాయకత్వంతో చర్చిస్తామని చెప్పారు. రాబోయే పరిశ్రమలతో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు రాబోతున్నాయని తెలిపారు.
రాష్ట్రంలో 128 దేవాలయాలపై దాడులు జరిగాయని చెబుతూ కొండ బిట్రగుంట అంతర్వేదిలో గత ప్రభుత్వంలో రధాలు తగలబెట్టినా ఎలాంటి విచారణ చేపట్టకుండా చిన్నచిన్న కారణాలతో జరిగాయి అంటూ, కేసులు మూసి చేశారని ధ్వజమెత్తారు. వీటిని సహించబోమని, హిందూ దేవాలయాల పైన దేవుళ్ళ పైన దాడులు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
More Stories
నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
అడ్డంకుల తొలగింపుకు చర్చలకు ట్రంప్, మోదీ సుముఖం!
రాహుల్ గాంధీ మలేసియా `విహార యాత్ర’పై దుమారం