పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నికలో టిడిపి గెలుపు

పులివెందుల జెడ్పీటీసీ ఉపఎన్నికలో టిడిపి గెలుపు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబంకు రాజకీయంగా కంచుకోటగా పేరొందిన పులివెందులలో మొదటిసారిగా జెడ్పీటీసీ ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతా రెడ్డి దాదాపు 6,050 ఓట్ల  మెజార్టీతో గెలుపొందారు. లతారెడ్డి పులివెందుల టీడీపీ ఇంఛార్జ్, మాజీ ఎమ్యెల్సీ బీటెక్ రవి సతీమణి. 
 
జగన్ మోహన్ రెడ్డి శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో జరిగిన ఈ ఉపఎన్నికలో వైసిపి అభ్యర్థి హేమంత్ రెడ్డి కేవలం 683 ఓట్లతో డిపాజిట్ కోల్పోయారు. టిడిపి అభ్యర్ధికి 6,735 ఓట్లు వచ్చాయి.  ముందే ఓటమిని ఉంహించిన వైసిపి నేతలు బుధవారం రెండు పోలింగ్ బూత్ లలో జరిగిన రీపోలింగ్ తో పాటు, గురువారం జరిగిన ఓట్ల లెక్కింపును కూడా బహిష్కరించారు.
 

మరోవంక, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలో కూడా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. రెండు రౌండ్లలో కలిపి వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డికి  6351 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డికి  12505 ఓట్లు వచ్చాయి. టీడీపీ మెజారిటీ 6154కు చేరింది.

 
ఎన్నికల ఫలితాల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం ప్రకటిస్తూ 30 ఏళ్ల తర్వాత పులివెందులలో చరిత్ర తిరగరాశామని కొనియాడారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగాయి కాబట్టి పులివెందుల జెడ్పీటిసీ ఉప ఎన్నికలకు 11 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారని చెప్పారు. అలాగే ఎన్నికల్లో కష్టపడి టీడీపీకి ఘన విజయాన్ని చేకూర్చిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.
జగన్ అసెంబ్లీ నియోజకవర్గమైన పులివెందులలో ఓ చిన్న జడ్పీటీసీ సీటును కాపాడుకోవడంలో వైసీపీ విఫలం కావడం రాబోయే రోజుల్లో ఆ పార్టీపై పెను ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి.  ఇప్పటికే గత ఎన్నికల్లో కడప జిల్లాలోని 10 అసెంబ్లీ సీట్లలో కేవలం మూడు సీట్లు గెలుచుకున్న వైసీపీకి ఇప్పుడు ఉపఎన్నికలో ఓటమి మరింత కుంగదీస్తోంది. ఎన్నో ఆశలు పెట్టుకుని విదేశాల నుంచి రప్పించిన అభ్యర్ధి హేమంత్ రెడ్డి కేవలం 683 ఓట్లు మాత్రమే సాధించి డిపాజిట్ కోల్పోవడం ఆ పార్టీకి పెద్ద షాక్ గా మారింది.