అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత పుతిన్ అలస్కాలో మరికొన్ని గంటల్లో భేటీ జరుగనుండగా శుక్రవారం నాటి చర్చల తనంతరం ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని పుతిన్ ఆపకపోతే అత్యంత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. ఉక్రెయిన్ భూభాగం విషయంలోనే చర్చలుంటాయని ఆయన స్పష్టం చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో పాటు ఇతర ఐరోపా నేతలతో వర్చువల్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శుక్రవారం అలస్కాలో పుతిన్‌తో భేటీ సవ్యంగా సాగుతుందని భావిస్తున్నానని చెప్పారు.
యుద్ధాన్ని ఆపేదిలేదని పుతిన్ చెబితే రష్యా తీవ్ర పర్వావసానాలు ఎదుర్కోక తప్పదని తేల్చి చెప్పారు. రెండో దఫా ఆంక్షలు కూడా విధించాల్సి వస్తుందని తెలిపారు. ఒకవేళ ఈ భేటీ సత్ఫలితాలిస్తే జెలెన్‌స్కీని కూడా కలుపుకొని మరో సమావేశం నిర్వహించే అవకాశం ఉందని ట్రంప్ వెల్లడించారు. అది మరింత ప్రభావవంతంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరువురి భేటీలో తనను అనుమతిస్తే భాగస్వామినవుతానని చెప్పారు.
కాగా, అలస్కాలో జరుగనున్న ట్రంప్, పుతిన్ భేటీ అత్యంత గోప్యంగా జరుగబోతున్నదని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. సమావేశం జరిగే గదిలో వారిద్దరితోపాటు అనువాదకులు మాత్రమే ఉంటారని పేర్కొన్నాయి. ఇంకెవరికీ ప్రవేశం ఉండబోదని తెలిపాయి. ఇరువురు నేతలు దాదాపు నాలుగేండ్ల తర్వత ముఖాముఖి చర్చలు జరుపనుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
మరోవైపు ట్రంప్‌తో సమావేశం అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మాట్లాడుతూ తమ దేశంలో శాంతిస్థాపన అంశంపై ప్రపంచ నేతలు ఏకతాటిపై ఉన్నారని తెలిపారు. పుతిన్ బుకాయింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. మొత్తం ఉక్రెయిన్‌ను ఆక్రమించగలనని చూపించేందుకు సరిహద్దుల్లో యుద్ధాన్ని విస్తరించేందుకు చూస్తున్నారని ఆరోపించారు. ఒకవేళ పుతిన్ కాల్పుల విరమణకు అంగీకరించపోతే రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడటంతో యుద్ధం నిలిచిపోయే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ఆంక్షల ప్రభావం లేనట్లు రష్యా నటిస్తున్నప్పటికీ, ఆ దేశ ఆర్థిక వ్యవస్థను అవి తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని చెప్పారు. అదేవిధంగా యుద్ధం ముగింపు ప్రయత్నాల్లో ట్రంప్ మాకు మద్దతుగా నిలిచారని తెలిపారు. పుతిన్‌తో చర్చల అనంతరం తనతో మాట్లాడతానని చెప్పినట్లు వివరించారు. ఆయనతో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ మీడియాతో మాట్లాడుతూ పుతిన్‌తో భేటీలో కాల్పుల విరమణ ఒప్పందం కుదరాలని అమెరికా కోరుకుంటున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారని తెలిపారు. అలాస్కా సమావేశం అనంతరం పుతిన్, జెలెన్‌స్కీలతో కలిసి మరో సమావేశం కోసం ప్రయత్నిస్తానని చెప్పినట్లు తెలిపారు. ఐరోపా, ఉక్రెయిన్ భద్రతా ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం ఉందని జర్మనీ ఛాన్సరల్ ఫ్రెడ్రిక్ మెర్జ్ చెప్పారు.
More Stories
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్, స్విట్జర్లాండ్‌లకు భారత్ హెచ్చరిక