ఎమ్మెల్సీలుగా కోదండరాం, అలీఖాన్ నియామకంపై స్టే

ఎమ్మెల్సీలుగా కోదండరాం, అలీఖాన్ నియామకంపై స్టే

ఎమ్మెల్సీ నియామకాలపై సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పును వెలువరించింది. కోదండరామ్‌, ఆమీర్‌ అలీఖాన్‌ ఎమ్మెల్సీ నియామకాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. గవర్నర్‌ కోటాలో కోదండరామ్‌, ఆమీర్‌ అలీఖాన్‌ నియామకమైన విషయం తెలిసిందే. ఇద్దరిని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్‌ చేసింది. 

అయితే, దీన్ని సవాల్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ అప్పటి ఎమ్మెల్సీ అభ్యర్థులు దాసోజు శ్రావణ్‌, సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయా పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు ఎమ్మెల్సీలుగా కోదండ రామ్‌, ఆలీఖాన్‌ ప్రమాణ స్వీకారాన్ని తప్పుపట్టింది. గతంలో ఇద్దరు ఎమ్మెల్సీల ఎన్నికపై సుప్రీంకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే.  తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపిక ఉండాలని మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది.

గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం సవరించింది. మధ్యంతర ఉత్తర్వుల తర్వాత ప్రమాణస్వీకారం చేయడం తప్పని సుప్రీంకోర్టు పేర్కొంది. ఉత్తర్వులు జారీ చేస్తామని జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహత ధర్మాసనం స్పష్టం చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్‌ ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రావణ్‌, సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా నామినేట్‌ చేసింది. వీరిద్దరిని అభ్యర్థిత్వాలను అప్పటి గవర్నర్‌ తిరస్కరించారు.

గవర్నర్‌ అభ్యర్థిత్వాలను తిరస్కరించడంతో శ్రావణ్‌, సత్యనారాయణ ఇద్దరూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల అనంతరం 2024 జనవరి 13న ప్రొఫెసర్‌ కోదండ రామ్‌, అలీఖాన్‌ పేర్లను రేవంత్‌రెడ్డి సర్కారు ప్రతిపాదించింది. గవర్నర్‌ వీరిద్దరి అభ్యర్థిత్వాలను ఆమోదించారు. గవర్నర్‌ నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించారు. కోదండ రామ్‌, అలీఖాన్‌ నియామకాలను హైకోర్టు రద్దు చేసింది. ఆ తర్వాత మరోసారి రేవంత్‌ సర్కారు మళ్లీ అవే పేర్లను గవర్నర్‌కు సిఫారసు చేసింది. 

గవర్నర్‌ ఆమోదంతో ఇద్దరు ఎమ్మెల్సీలుగా నియామకమయ్యారు. గవర్నర్‌ నిర్ణయంపై ఆగస్టు 4న దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణ ఇద్దరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గవర్నర్‌ కార్యాలయం సైతం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం కోదండ రామ్‌, ఆలీఖాన్‌ ప్రమాణస్వీకారాన్ని తప్పుపట్టింది.