పూరి ఆలయం గోడలపై హెచ్చరిక రాతలు

పూరి ఆలయం గోడలపై హెచ్చరిక రాతలు

ఒడిశాలోని పూరి ఆలయ భద్రతపై మరోసారి సందేహాలు నెలకొన్నాయి. ఆలయాన్ని ధ్వంసం చేస్తామంటూ ‘మా ఠాకురాణి మందిరం’ గోడలపై హెచ్చరికలతో కూడిన రాతలు బుధవారంనాడు కనిపించడం ఈ ఆందోళనలకు దారితీసింది. టెంపుల్ పరిక్రమ ప్రాజెక్ట్ పాత్‌ వే ఎంట్రన్స్ సమీపంలో ఈ ఆలయం ఉంది.  గోడలపై రాసిన రాతల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరు కూడా ఉండటంతో స్థానికులు, అధికార యంత్రాంగం ఉలిక్కిపాటుకు గురయ్యారు. 

ఆలయాన్ని ఉగ్రవాదులు ధ్వంసం చేయనున్నట్టు ఆ హెచ్చరిక రాతల్లో ఉంది. దీనితో పాటు పలు ఫోన్ నెంబర్లు, ‘కాల్ మి’ అనే రాతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పరిక్రమ పాత్ వే దక్షిణ భాగంలో ఈ ఘటన చోటుచేసుకోవడం భద్రతా పరిస్థితిపై పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఏరియా నిరంతరం సీసీటీవీ, సెక్యూరిటీ గార్డుల పర్యవేక్షణలో ఉంది. 

అయినప్పటికీ గోడలపై రాతలను కనిపెట్టలేకపోవడం ప్రశ్నార్థకమవుతోంది. జగన్నాథ ఆలయం భద్రతకు సంబంధించిన ఆందోళనలు తలెత్తడం ఇదే మొదటిసారి కాదు. భద్రతను పటిష్టం చేయాలని కేంద్ర హోం శాఖ, ఎన్ఎస్‌జీ తరచు సిఫారసు చేస్తూనే ఉన్నాయి. అయితే పరిక్రమ పాత్ వే‌ వెంబడి ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో చాలామటుకు పనిచేయడం లేదని తెలుస్తోంది.

ఠాకురాణి ఆలయం గోడలపై ఏవో రాతలు ఉన్నట్టు సోషల్ మిడియా, వివిధ వర్గాల ద్వారా బుధవారం ఉదయం తమ దృష్టికి వచ్చిందని పూరీ ఎస్‌పీ పినాక్ మిశ్రా తెలిపారు. వెంటనే తాము వెరిఫికేషన్ చేశామని, జగన్నాథ ఆలయానికి సంబంధించి కొన్ని అభ్యంతరకరమైన రాతలు గోడపై కనిపించాయని చెప్పారు.  ప్రత్యేక టీమ్‌తో ఈ రాతలు ఎప్పుడు, ఏ సమయంలో రాసారో తెలుసుకుంటామని, ఇది ఆలయ భద్రతకు సంబంధించిన ఆంశమైనందున చాలా సీరియస్‌గా తీసుకుంటామని చెప్పారు.

ఇప్పటికే తమ టీమ్ ఘటనా స్థలిలో కొన్ని కీలక ఆధారాలు సేకరించిందని చెప్పారు. నిందితులను పట్టుకోగానే దీని వెనుక ఉద్దేశం వెలికితీస్తామని తెలిపారు. పరిక్రమ ప్రాజెక్టులో సీసీటీవీ కవరేజ్ ఒక భాగమని, అయితే కొన్ని చోట్ల పనులు ఇంకా పూర్తి కాలేదని వివరించారు. ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు పనిచేశాయో లేదో పరిశీలిస్తామని చెప్పారు.