
వాస్తవానికి సెప్టెంబరు 26న న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి 80వ జనరల్ అసెంబ్లీ సమావేశంలో ప్రసంగించేందుకు మోదీ వెళ్తున్నారు. ఐరాసకు చెందిన ఈ ప్రతిష్ఠాత్మక సమావేశాల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సహా పలు దేశాల ప్రభుత్వాధినేతలతో భారత ప్రధాని భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి ట్రంప్ – మోదీ భేటీకి అధికారికంగా షెడ్యూల్‌ను ఫిక్స్ చేయించేందుకు భారత విదేశాంగ శాఖ కసరత్తు మొదలుపెట్టిందని సంబంధిత వర్గాలు అంటున్నాయి.
డొనాల్డ్ ట్రంప్ కూడా మోదీతో భేటీకి ఆసక్తితోనే ఉన్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశం ద్వారా అమెరికాతో ఏర్పడిన పొరపొచ్చాలను తొలగించుకొని, రాజీకి వచ్చే దిశగా భారత్ ప్రయత్నాలు చేసే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. ఒకవేళ ఈ భేటీ సవ్యంగా జరిగితే, అక్టోబరులో క్వాడ్ సదస్సు కోసం భారత్‌కు రావాల్సిందిగా ట్రంప్‌ను ప్రధాని మోదీ ఆహ్వానించే అవకాశం ఉంది. క్వాడ్ కూటమిలో అమెరికా, భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, జపాన్‌లు సభ్యదేశాలుగా ఉన్నాయి.
వాస్తవానికి జూన్ నెలలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో పాటు భారత ప్రధాని మోదీని వైట్‌హౌస్‌కు ట్రంప్ ఆహ్వానించారు. అయితే ఆ ఆహ్వానాన్ని భారత్ తిరస్కరించింది. మునీర్‌తో కలిసి ట్రంప్‌తో భేటీ అయ్యేందుకు నిరాకరించారు. నాటి నుంచే భారత్ – అమెరికా మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరిలో వైట్ హౌస్ వేదికగా ట్రంప్‌తో నరేంద్రమోదీ సమావేశమయ్యారు. ఏడు నెలల విరామం తర్వాత సెప్టెంబరు చివరి వారంలో ఈ ఇద్దరూ మళ్లీ భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ట్రంప్ – మోదీ భేటీకి సంబంధించిన అజెండాలో భారత్ – అమెరికా మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఉండే అవకాశం ఉంది. భారత వ్యవసాయ రంగాన్ని, డైరీ రంగాన్ని అమెరికా కంపెనీల కోసం తెరిచేందుకు భారత్ విముఖంగా ఉంది. అయితే ఆ రంగాల్లోనూ తమ కంపెనీలకు ప్రవేశాన్ని కల్పించాల్సిందే అని అమెరికా వాదిస్తోంది. ఈ విభేదాల వల్లే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై ఇరుదేశాల నడుమ పలు విడతలుగా చర్చలు జరిగినా, ఏకాభిప్రాయం మాత్రం కుదరలేదు.
దీంతో తొలుత భారతదేశానికి చెందిన వస్తు, ఉత్పత్తులపై అమెరికా 25 శాతం అదనపు దిగుమతి సుంకాన్ని విధించింది. ఆ తర్వాత కూడా ట్రేడ్ డీల్‌పై పురోగతి జరగకపోవడంతో ఈ సుంకాన్ని రెట్టింపు చేసి 50 శాతానికి చేర్చింది. ఇది ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానుంది. మరోవంక, రష్యా నుంచి క్రూడ్ ఆయిల్‌ను కొనే అతిపెద్ద దేశంగా భారత్ ఉండటం అనేది అమెరికాను కలవరపరుస్తోంది. ముడి చమురును కొని భారత్ అందిస్తున్న నిధుల వల్లే ఉక్రెయిన్‌తో నేటికీ రష్యా యుద్ధాన్ని కొనసాగించగలుగుతోంది అనేది అగ్రరాజ్యం అభిప్రాయం. దీనిపై ట్రంప్‌కు మోదీ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్ కు చైనా, ఐరోపా, యుఎఈ, అమెరికాల నిఘా యంత్రాలు