సింధూ జలాలకు పాక్ బెదిరింపులు, లేదంటే కాళ్ల బేరం

సింధూ జలాలకు పాక్ బెదిరింపులు, లేదంటే కాళ్ల బేరం
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ సింధూ జలాల ఒప్పందం అమలు ఆపివేస్తున్నట్లు ప్రకటించడంతో పాక్ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అసిమ్ మునీర్, బిలావల్ భుట్టోల యుద్ధ బెదిరింపులు ఒకవైపు, నీటి కోసం పాక్ ప్రాధేయపడడం మరోవైపు చూస్తుంటే, పాకిస్తాన్ పరిస్థితి దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. 
 
అయితే బెదిరింపులు లేదంటే కాళ్ల బేరం అన్నట్లుగా పాక్ తీరు ఉంది. ఈ చర్యతో పాకిస్తాన్‌లో నీటి సంక్షోభం తీవ్రమైంది. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అమెరికా పర్యటనలో భారత్‌పై అణుయుద్ధ బెదిరింపులు చేస్తూ, సింధూ నదిపై భారత్ నిర్మిస్తున్న ఆనకట్టలను క్షిపణులతో ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ఆ తర్వాత బిలావల్ భుట్టో సైతం భారత్‌కు యుద్ధ హెచ్చరికలు చేశారు. 
 
పాకిస్తాన్ తీవ్రమైన నీటి సమస్యను ఎదుర్కొంటోంది. ఖరీఫ్ సీజన్ వస్తుడటంతో పాకిస్తాన్ రైతులకు సాగునీరు లేకుండా పోయింది. తాగునీటి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. సోమవారం పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం ఒక కీలక ప్రకటన చేసింది. సింధూ జలాల  ఒప్పందం తక్షణమే పునరుద్ధరించాలని భారతదేశాన్ని కోరింది. ఆగస్టు 8న కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపింది. 
 
పశ్చిమ నదులైన చీనాబ్, జీలం, సింధు నదులపై భారతదేశం నిర్మించబోయే కొత్త రన్-ఆఫ్-రివర్ జలవిద్యుత్ ప్రాజెక్టుల డిజైన్ ప్రమాణాలను ఈ తీర్పు వివరించిందని ఇస్లామాబాద్ పేర్కొంది. “ఇండస్ జలాల ఒప్పందం సాధారణ విధులను తక్షణమే పునఃప్రారంభించాలని, దాని ఒప్పంద బాధ్యతలను పూర్తిగా, విశ్వసనీయంగా నెరవేర్చాలని మేము భారతదేశాన్ని కోరుతున్నాము” అని విదేశాంగ కార్యాలయం ఎక్స్ లో పోస్ట్ చేసింది. 
 
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం భారత్‌కు అనేక లేఖలు రాసింది. సింధూ నదీ జలాల ఒప్పందంపై తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని, నీటిని విడుదల చేయాలని కోరింది. అయితే, భారత్ పాకిస్తాన్ అభ్యర్థనలను సున్నితంగా తిరస్కరించింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకునేంత వరకు ఈ విషయంలో ఎలాంటి చర్చలు ఉండవని భారత్ స్పష్టం చేసింది. “నీరు, రక్తం కలిసి ప్రవహించలేవు” అని భారత ప్రధాని నరేంద్ర మోదీ గతంలో చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.