మతం మార్పిడికై ప్రియుడి వేధింపులతో యువతి ఆత్మహత్య

మతం మార్పిడికై ప్రియుడి వేధింపులతో యువతి ఆత్మహత్య
 
కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో 23 ఏళ్ల సోనా ఎల్డోస్ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ప్రియుడు, అతని బంధువులు వివాహం చేసుకోవాలంటే ఇస్లాం మతంలోకి మారాలని ఒత్తిడి చేశారని, అందుకే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి కుటుంబం ఆరోపించింది. కేరళలోని కోతమంగళానికి చెందిన సోనా ఎల్డోస్ శనివారం తన నివాసంలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. 
 
పోలీసులు మొదట అసహజ మరణంగా కేసు నమోదు చేశారు. కానీ తర్వాత మృతురాలు రాసిన సూసైడ్ నోట్ లభించడంతో ఈ కేసును ‘మతమార్పిడి కోసం శారీరక దాడి, మానసిక వేధింపులు’ అనే సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు.  వివరాల్లోకి వెళ్తే కొత్త మంగళారం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పరవూర్‌కు చెందిన రమీస్‌, 23 ఏళ్ల సోనా ఎల్దోస్‌ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. సోనా టీచర్‌ ట్రెయినింగ్‌ కోర్సు చదువుతోంది. 
 
ఈ క్రమంలో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి చేసుకోవాలంటే ముందుగా ఆమె ముస్లిం మతంలోకి మారాలని షరతు విధించారు. ఆమె అందుకు ఒప్పుకోకపోవడంతో ఒత్తిడి చేశారు. అయినా మతం మారేందుకు ఆమె ససేమిరా అనడంతో ఓ గదిలో బంధించి రమీస్‌, అతడి కుటుంబం, బంధువులు తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత రమీస్‌.. ఎక్కడైనా చావుపో అని తిట్టి పంపించాడు. 
 
దాంతో ఆమె తన ఇంటికి చేరుకుని, తాను చచ్చిపోతున్నానని అతడికి మెసేజ్‌ పెట్టింది. దాంతో సరే మంచిది కానియ్‌ అని అతడు సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి గదిలో లభ్యమైన సూసైడ్‌ లెటర్‌లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారి వాట్సాప్‌ చాట్‌ను పరిశీలించగా ఆమె చనిపోతున్నానని మెసేజ్‌ చేయడం, అతడు ఓకే కానియ్‌ అని సమాధానం ఇవ్వడం కనిపించాయి. 
 
దాంతో మృతురాలి కుటుంబం ఫిర్యాదు మేరకు ఆత్మహత్యకు పురికొల్పిన నేరం కింది రమీస్‌ను అరెస్ట్ చేశారు. లభ్యమయ్యే సాక్ష్యాధారాల ఆధారంగా ఇతర నిందితులను కూడా అదుపులోకి తీసుకోనున్నట్లు చెప్పారు. వివాహం నమోదు చేసుకునే నెపంతో రమీజ్ సోనాను వాళ్ల ఇంటికి తీసుకెళ్లాడని, అక్కడ రమీజ్, అతని కుటుంబసభ్యులు సోనాను ఇస్లాం మతంలోకి మారితేనే వివాహం జరుగుతుందని బెదిరించినట్టు సమాచారం .

తమ మతంలోకి మారమని రమీజ్ తనను బలవంతం చేశాడన సోనా తన సూసైడ్ నోట్ లో పేర్కొనడంతో రమీజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రమీజ్ పై భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్) సెక్షన్ 69 (వివాహానికి తప్పుడు హామీ ఇచ్చి లైంగిక సంపర్కానికి పాల్పడ్డం) కింద కేసు నమోదు చేశారు. సోనా తల్లి, వాళ్ల ఇంటి పనిమనిషి బిందు ఈ ఘటనపై మీడియాతో మాట్లాడారు. 

సోనా మొదట మత మార్పిడికి ప్రేమ మాయలో అంగీకరించిందని, కానీ రమీజ్ అనైతిక వ్యవహారాలు చూసిన తర్వాత నిరాకరించిందని వాళ్లు తెలిపారు. తన కుమార్తె రమీజ్ ను ఎంతగానో ప్రేమించిందని, అయితే, మతం మారాలంటూ చాలా కాలంగా చిత్రవధకు చేశారని సోనా తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. వేధింపులు తట్టుకోలేక సోనా ఎట్టిపరిస్థితుల్లోనూ మతం మారనని తేల్చి చెప్పిందని పనిమనిషి బిందు మీడియాకు చెప్పింది. దీంతో సోనాను ఒక గదిలో బంధించారని, బాధితురాలి సోదరుడిని కూడా కొట్టారని బిందు తెలిపింది.

“ఆమెను మతం మార్చేందుకు పొన్నానికి తీసుకెళ్లడానికి చేసిన ప్రయత్నాలను ఆమె ప్రతిఘటించిన తర్వాత గత వారం ఆమెను ఓ గదిలో నిర్బంధించి కొట్టారు. ఆమె వివాహం రిజిస్టర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది.  కానీ మతం మార్చడానికి సిద్ధంగా లేదని ఆమె డిమాండ్‌ను వారు పట్టించుకోలేదు” అని బాలిక తల్లి ఆవేదనతో పోలీసులకు చెప్పింది. దర్యాప్తు అధికారులు  రమీజ్ ఆమెపై దాడి చేసినట్లు ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. 

అతని కుటుంబ సభ్యులను సహ నిందితులుగా పేర్కొనే అవకాశం ఉంది. సోనా కుటుంబం నుండి వచ్చిన ఆత్మహత్య నోట్, వాంగ్మూలంల ప్రకారం వారిద్దరి మధ్య కళాశాలలో ఉన్నప్పుడు ప్రారంభమైన ప్రేమను తర్వాత అతను దుర్వినియోగ పరిచాడు.  సోనా తండ్రి ఇటీవల మరణించడంతో ఆమె ఆ పేరుతో మతమార్పిడి ప్రక్రియను ఆలస్యం చేసింది. అనైతిక అక్రమ రవాణా కేసులో రమీజ్ గతంలో అరెస్టు అయినప్పటికీ, సోనా అతన్ని క్షమించిందని ఆమె సోదరుడు ఆరోపించాడు. 
ఇటీవల, రమీజ్ ఒక స్నేహితుడిని సందర్శించే నెపంతో ఆమెను తన ఇంటికి తీసుకెళ్లి, ఒక గదిలో బంధించి, ఆమెపై దాడి చేశాడని ఆరోపించారు. ఆమె మతమార్పిడి కోసం పొన్నానికి తీసుకెళ్లడానికి అతను ఒక వాహనాన్ని కూడా సిద్ధం చేశాడని, కానీ ఆమె నిరాకరించడంతో, ఆమెను చనిపోవాలని చెప్పాడు. కొచ్చి విమానాశ్రయంలో తాత్కాలిక సిబ్బందిగా  రమీజ్ పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.