
జూలై నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) పథకాల్లో నికర పెట్టుబడులు సరికొత్త జీవితకాల రికార్డు స్థాయి రూ.42,702 కోట్లకు పెరిగాయి. ఈ జూన్‌లో నమోదైన రూ.23,578 కోట్ల పెట్టుబడులతో పోలిస్తే ఏకంగా 81 శాతం వృద్ధి నమోదైంది. గత నెలలో ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడుదుడుకులకు లోనైన తరుణంలోనూ ఈ విభాగ మ్యూచువల్ ఫండ్ పథకాల్లోకి రికార్డు స్థాయిలో కొత్త పెట్టుబడులు రావడం గమనార్హం.
థీమాటిక్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లలో పెట్టుబడులు గణనీయంగా పెరగడం ఇందుకు ప్రధానంగా దోహదపడింది. కాగా, ఈక్విటీ ఫండ్ పథకాల్లోకి నికర పెట్టుబడులు రావడం వరుసగా ఇది 53వ నెల అని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) సోమవారం తన నివేదికలో వెల్లడించింది. ‘‘సుంకాల పోరు నేపథ్యంలో అంతర్జాతీయంగా అనిశ్చితులు పెరిగినప్పటికీ, భారత వృద్ధికి ఢోకా లేదనడానికి ఈక్విటీల్లోకి పెరిగిన నిధుల వరదే నిదర్శనం.
దిగివచ్చిన ధరలు (ద్రవ్యోల్బణం), మెరుగైన ద్రవ్య లభ్యత, పెరిగిన కుటుంబ ఆదా వంటి అంశాలు ఇందుకు దోహదపడుతున్నాయ’’ని యాంఫీ సీఈఓ వెంకట్ ఎన్ చలసాని తెలిపారు. మ్యూచువల్ ఫండ్ పథకాల్లోకి క్రమానుగుత పెట్టుబడులూ (సిప్) సరికొత్త రికార్డు స్థాయికి పెరిగాయి. గత నెలలో ఫండ్ మదుపరులు రూ.28,464 కోట్లు సిప్ చేశారు. అంతక్రితం నెలలో నమోదైన రూ.27,269 కోట్ల సిప్‌లతో పోలిస్తే 4 శాతం అధికం ఇది.
ఈ జూన్‌లో డెట్ ఫండ్ల నుంచి నికరంగా రూ.1,711 కోట్లు వెనక్కి తీసుకున్న ఇన్వెస్టర్లు జూలైలో ఏకంగా రూ.1.06 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు. లో డ్యూరేషన్, మనీ మార్కెట్ ఫండ్లతో పాటు లిక్విడ్, ఓవర్‌నైట్ ఫండ్లలో భారీగా కొత్త పెట్టుబడులు రావడం ఇందుకు తోడ్పడింది. గత నెలలో గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ల (ఈటీఎ్‌ఫ)ల్లోకి నికరంగా రూ.1,256 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అంతక్రితం నెలలో వచ్చిన రూ.2,081 కోట్ల పెట్టుబడులతో పోలిస్తే మాత్రం గణనీయంగా తగ్గాయి. అయితే, వీటిల్లోకి నికర పెట్టుబడులు రావడం వరుసగా ఇది మూడో నెల. మొత్తంగా జూలైలో ఎంఎఫ్ ఇండస్ట్రీలోకి రూ.1.8 లక్షల కోట్ల కొత్త పెట్టుబడులు వచ్చాయి.
జూన్‌తో పోలిస్తే 49,000 కోట్లు, మే నెలలో వచ్చిన దానికంటే రూ.29,000 కోట్లు అధికం. తత్ఫలితంగా దేశంలోని మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ (ఏయూఎం) జూలైలో 1.3ు పెరిగి రూ.75.36 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇండస్ట్రీ ఏయూఎం రూ.75 లక్షల కోట్ల మైలురాయిని దాటడం ఇదే తొలిసారి. జూన్‌లో ఇది రూ.74.4 లక్షల కోట్లుగా నమోదైంది.
More Stories
దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా రోష్ని నాడార్
డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో నటుడు విశాల్ బ్రహ్మ అరెస్ట్
తక్కువ స్థాయిలో ద్రవ్యోల్బణం .. ఎస్బీఐ అంచనా