జెలెన్ స్కీ‌కి ప్రధాని మోదీ ఫోన్

జెలెన్ స్కీ‌కి ప్రధాని మోదీ ఫోన్
రష్యాతో ఉద్రిక్తతల వేళ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో చర్చలు జరిపారు. తాజా పరిణామాలపై ఇరువురు నాయకులు చర్చించారు. రష్యాతో యుద్ధంపై తాజా పరిణామాలను జెలెన్‌స్కీ వివరించగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ప్రధాని సూచించారు.  రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య శాంతియుత పరిష్కారానికి భారత్ తన వంతు మద్దతు ఇస్తుందని ప్రధాని స్పష్టం చేశారు.
అలాగే భారత్ అందిస్తున్న సహకారం కొనసాగుతోందని ఈ సందర్భంగా ఆయనకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. సోమవారం ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీకి ప్రధాని మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా వీరిద్దరు పలు కీలక అంశాలపై చర్చించారు.  ఆ క్రమంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యంపై వీరు సమీక్షించారు. పరస్పర ప్రయోజనాల సహకారం పెంపు మార్గాలపై ఈ సందర్భంగా వారు చర్చించారు. భవిష్యత్తులో సైతం సంప్రదింపులు కొనసాగించాలని వీరిద్దరు నిర్ణయించారు. 
ఉక్రెయిన్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.  ఉక్రెయిన్ లక్ష్యంగా రష్యా జరుపుతున్న దాడులను ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఆ దేశాధ్యక్షుడు వివరించారు. జాపోరిజ్జియా బస్టాండ్‌పై రష్యా బీకర బాంబుల దాడికి తెగ బడిందని తెలిపారు. ఈ దాడిలో పదుల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరుదేశాల మధ్య శాంతి కోసం దౌత్యపరమైన అవకాశాలు కొనసాగుతాయని చెప్పారు. 
 
అయితే రష్యా దురాక్రమణతోపాటు అక్రమణలు కొనసాగుతోన్నాయని మండిపడ్డారు. దీంతో కాల్పుల విరమణకు అంగీకరించేది లేదని ప్రధాని మోదీకి ఉక్రెయిన్ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీ కుండబద్దలు కొట్టారు. ఉక్రెయిన్‌కు మద్దతు తెలపడం పట్ల ప్రధాని మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
జెలెన్‌స్కీతో ఫలప్రదమైన సంభాషణ జరిగిందని ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్టు చేశారు. 
 
మరోవైపు, సెప్టెంబర్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి సమావేశంలో ఇరువురు వ్యక్తిగతంగా భేటీ కావాలని వారు నిర్ణయించారు. ఈ భేటీలో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలను మెరుగు పరుచుకునేందుకు ఉపయోగపడతాయని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. ఈ సమావేశం ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక చర్చలు, శాంతి, సౌభ్రాతృత్వం నెలకొంటాయని వీరు పేర్కొన్నారు.
 
మోదీతో ఫోన్‌ సంభాషణపై జెలెన్‌స్కీ కూడా “భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో నేను సుదీర్ఘంగా మాట్లాడాను. ద్వైపాక్షిక సహకారం, మొత్తం దౌత్య పరిస్థితి వంటి అన్ని ముఖ్యమైన అంశాలను మేము వివరంగా చర్చించాము. మన ప్రజలకు మద్దతుగా ప్రధానమంత్రి అందించిన హృదయపూర్వక మాటలకు నేను ఆయనకు కృతజ్ఞుడను. సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా వ్యక్తిగత సమావేశాన్ని ప్లాన్ చేయాలని, సందర్శనల మార్పిడిపై పనిచేయాలని మేము అంగీకరించాము” అని ఎక్స్ లో తెలిపారు.