
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా దేశ రాజధాని ఢిల్లీ నుంచి అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసి మధ్య నాన్‌స్టాప్ విమాన సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుంచి ఈ నిలిపివేత అమలులోకి వస్తుందని పేర్కొంది. ఆపరేషనల్ పరిమితుల దృష్ట్యా ఈ రూట్లో సర్వీసులను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. 26 బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానాలకు రెట్రోఫిటింగ్ చేపడుతున్న కారణంగా విమానాల కొరత, అలాగే పాకిస్థాన్ గగనతలం మూసివేత ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. విమానాల కొరతే అందుకు కారణం అని తెలిపింది.
గత నెలలో 26 బోయింగ్ 787 విమానాలు రెట్రోఫిట్ చేయడం ప్రారంభించినట్లు ఎయిరిండియా పేర్కొంది. వినియోగదారుల ప్రయాణ అనుభవాన్ని గణనీయంగా పెంచే లక్ష్యంతో చేపట్టిన ఈ విస్తృతమైన కార్యక్రమం వల్ల 2026 చివరి వరకూ ఎప్పుడైనా కొన్ని విమానాలు అందుబాటులో ఉండకపోవచ్చని ప్రకటనలో తెలిపింది. దీంతో పాటు పాకిస్థాన్ గగనతలం మూసి ఉండటం వల్ల విమానాల సుదూర కార్యకలాపాలపై ప్రభావం పడుతుందని తెలిపింది.
ఆపరేషనల్ సమస్యల నేపథ్యంలో ఈ విమానాల నిలిపివేత నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. సెప్టెంబర్ 1 తర్వాత వాషింగ్టన్ డిసికి లేదా అక్కడి నుంచి ఢిల్లీకి టికెట్లు బుకింగ్ చేసుకొనే ప్రయాణికుల్ని సంప్రదించి వారి వ్యక్తిగత ప్రాధాన్యతల ప్రకారం ఇతర విమానాల్లో రీబుకింగ్ లేదా పూర్తి రీఫండ్ సహా ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చింది.
ప్రయాణికుల ఇష్టప్రకారం ఇతర విమానాల్లో సీట్లు కేటాయించడం లేదా టికెట్ డబ్బును పూర్తిగా వాపసు చేయడం వంటి ఆప్షన్లు అందిస్తామని తెలిపింది. ఇదిలావుంటే, డైరెక్ట్ ఫ్లైట్ రద్దయినా ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎయిరిండియా పేర్కొంది.
తమ భాగస్వామ్య విమానయాన సంస్థలైన అలస్కా ఎయిర్‌లైన్స్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్‌లైన్స్ ద్వారా న్యూయార్క్ (జేఎఫ్‌కే), నెవార్క్ (ఈడబ్ల్యూఆర్), చికాగో, శాన్ ఫ్రాన్సిస్కోల మీదుగా వాషింగ్టన్ డీసీకి వన్-స్టాప్ విమాన సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. ఉత్తర అమెరికాలోని టొరంటో, వాంకోవర్‌తో సహా మరో ఆరు నగరాలకు నాన్‌స్టాప్ సర్వీసులు కొనసాగుతాయని ఎయిర్ ఇండియా తెలిపింది.
More Stories
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు
ట్రంప్ బెదిరింపులతో ఐటి రంగంపై భారత్ దృష్టి