ఈసీ వద్దకు ర్యాలీ..  రాహుల్ తో సహా ఎంపీల అరెస్ట్

ఈసీ వద్దకు ర్యాలీ..  రాహుల్ తో సహా ఎంపీల అరెస్ట్
పార్ల‌మెంట్ హౌస్ నుంచి కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఆఫీసు వ‌ర‌కు ర్యాలీ తీసే ప్ర‌య‌త్నం చేసిన‌ కాంగ్రెస్ నేత‌లు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీల‌తో సహా 30 మంది ఎంపిలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్గ‌మ‌ధ్యంలో వాళ్ల‌ను అడ్డుకుని అరెస్టు చేశారు. బ‌స్సుల్లోకి ఎక్కించి పార్ల‌మెంట్ స్ట్రీట్ పోలీసు స్టేష‌న్‌కు కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గేతో పాటు జైరాం ర‌మేశ్‌ను త‌ర‌లించారు. 

బిహార్​లో చేసిన ఓటర్ల జాబితా సవరణ (ఎస్​ఐఆర్​)ను నిరసిస్తూ చేపట్టిన ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, శరద్​ పవార్​ సహా ప్రతిపక్ష ఎంపీలు పాల్గొన్నారు. పార్లమెంట్ ముఖద్వారం వద్ద నిరసన ప్రారంభించే ముందు, వారంతా జాతీయ గీతాన్ని ఆలపించారు. అయితే ర్యాలీగా వెళ్తున్న వీళ్లను ట్రాన్స్​పోర్ట్ భవన్​ వద్ద పోలీసులు అడ్డగించారు. 

విపక్ష నేతల ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదని దిల్లీ పోలీసులు చెప్పారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ‘ఎస్​ఐఆర్’​, ‘ఓట్​ చోరీ’ ప్లకార్డ్​లు, బ్యానర్లు పట్టుకొని విపక్ష నేతలు నినాదాలు చేశారు. త‌మ పోరాటం రాజ‌కీయం కోసం కాదు అని, రాజ్యాంగం కోసం అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. నిజాలు యావ‌త్ దేశం ముందు ఉన్నాయ‌ని పేర్కొన్నారు.

30 మంది ఎంపీలతో రావాలని, ఎన్నికల కమిషన్ స్పష్టం చేయగా అందుకు ఇండియా కూటమి నేతలు నిరాకరించారు. అసలు ఎన్నికల కమిషన్‌ దగ్గరికి వెళితే, ఈ ప్రభుత్వానికి ఇబ్బంది ఏంటని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. వాళ్లు దేనికో భయపడుతున్నట్లు అనిపిస్తోందని చెప్పారు. ఇది శాంతియుతంగా జరిగిన ఆందోళన మాత్రమేనని, ఎన్నికల కమిషన్‌ దీన్ని మరింత సున్నితంగా నిర్వహించాలని హితవు చెప్పారు. కూటమి పార్టీల నుంచి 30 మంది ఎంపీలను మాత్రమే ఎంచుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.

కొంద‌రు ఎంపీలు పార్ల‌మెంట్ స్ట్రీట్‌లో ఉన్న పీటీఐ బిల్డింగ్ వ‌ద్ద బైఠాయించారు. ఎన్నిక‌ల సంఘం ఆఫీసుకు కిలోమీట‌రు దూరంలో వాళ్ల‌ను అడ్డుకున్నారు. బీహార్ ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ చేప‌ట్టడాన్ని విప‌క్షాలు వ్య‌తిరేకించాయి. ట్రాన్స్‌పోర్టు భ‌వ‌న్ వ‌ద్ద పోలీసులు కొంద‌రు ఎంపీలను అదుపులోకి తీసుకున్నారు. 

ఎస్ఐఆర్, వోట్ చోరీ అని తెల్ల క్యాప్‌ల‌పై రాసి వాటిని విప‌క్ష ఎంపీలు ధ‌రించారు. సిర్‌కు వ్య‌తిరేకంగా ప్ల‌కార్డులు, బ్యాన‌ర్లు ప్ర‌ద‌ర్శించారు. టీఆర్ బాలు, సంజ‌య్ రౌత్‌, డెరిక్ ఓబ్రెయిన్‌, ప్రియాంకా గాంధీ, అఖిలేశ్ యాద‌వ్‌తో పాటు ఇత‌ర నేత‌లు ర్యాలీలో పాల్గొన్నారు. ట్రాన్స్‌పోర్ట్ భ‌వ‌న్ వ‌ద్ద టీఎంసీ ఎంపీలు మ‌హువా మొయిత్రా, సుస్మితా దేవ్‌, సంజ‌నా జాత‌వ్‌, జ్యోతిమ‌ని ఎంపీలు బారికేడ్ల‌ను ఎక్కారు.