
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారతదేశ వృద్ధిని ట్రంప్ అంగీకరించలేకపోతున్నారని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఎద్దేవా చేశారు. ‘మనమే అందరికీ బాస్ అయితే, భారత్ ఇంత వేగంగా ఎలా అభివృద్ధి చెందుతోంది అని వాళ్లు అసూయ పడుతున్నారు’ అని రాజ్‌నాథ్ సింగ్ ధ్వజమెత్తారు. మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లా ఉమరియా గ్రామంలో బీఈఎంఎల్ కొత్త యూనిట్‌కు శంకుస్థాపన చేసిన సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ భారత్ పై ట్రంప్ విధించిన అధిక సుంకాలను తీవ్రంగా విమర్శించారు.
ప్రపంచ శక్తులు భారతదేశ వేగవంతమైన వృద్ధిని చూసి అసూయపడుతున్నాయని పేర్కొన్నారు. కొన్ని దేశాలు భారత ఆర్థిక పురోగతిని అసూయతో చూస్తూ ఆ పురోగతిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ట్రంప్ మీద సూటిగా చేసిన విమర్శలలో రాజ్ నాథ్ సింగ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ‘సబ్కే బాస్'(అందరికీ మేమే బాస్) అనే పదప్రయోగం చేశారు. తన సందేశాన్ని అత్యంత దృఢంగా, పూర్తి స్పష్టంగా చెప్పేశారు రాజ్ నాథ్ సింగ్. భారతదేశం సూపర్ పవర్ గా మారకుండా ఎవరూ ఆపలేరని తేల్చి చెప్పారు.
“కొంతమంది భారతదేశం పురోగతిని అంగీకరించలేకపోతున్నారు. వారు దానిని పాజిటివ్‌గా తీసుకోవడం లేదు. భారతదేశం ఇంత వేగంగా ఎలా అభివృద్ధి చెందుతోంది? అని మదనపడుతున్నారు. ‘ మేడ్-ఇన్-ఇండియా ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేసినప్పుడు వాటిని మరింత ఖరీదైనదిగా చేయడానికి ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి” అని ఆయన ధ్వజమెత్తారు.
భారతదేశంలో తయారు చేసిన ఉత్పత్తులను ఖరీదైనవిగా చేయడం ద్వారా, ఇతర దేశాలు వాటిని దూరం చేసే ప్రయత్నంగా అమెరికా ట్రేడ్ టారిఫ్స్ ను అభివర్ణించారు మంత్రి రాజ్ నాథ్. కానీ భారతదేశం అభివృద్ధి చెందుతున్న వేగం చూస్తే, ఏ ప్రపంచ శక్తి కూడా మనం సూపర్ పవర్ గా మారకుండా ఆపలేవని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు అమెరికా, భారతదేశంపై 50% సుంకాలు, జరిమానాలను విధించిన సంగతి తెలిసిందే. ఈ చర్యను భారత ప్రభుత్వం ‘అన్యాయం.. అసమంజసం’ అని వ్యాఖ్యానించింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ సందర్భంగా ఆపరేషన్ సిందూర్, ‘ఆత్మనిర్భర్’ లేదా స్వావలంబనగా మారడానికి భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కూడా ప్రస్తావించారు.
More Stories
వక్ఫ్ సవరణ చట్టంలో రెండు నిబంధనల అమలు నిలిపివేత
బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో రెండు బంగారు పతకాలు
ఓట్ల కోసం చొరబాటుదారులను కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది