భూభాగం వదులుకునేందుకు జెలెన్‌స్కీ తిరస్కారం

భూభాగం వదులుకునేందుకు జెలెన్‌స్కీ తిరస్కారం
మూడున్నరేేండ్లకుపైగా పైగా కొనసాగుతోన్న రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధానికి తెర పడేందుకు శాంతి ఒప్పందంలో భూభాగాల మార్పిడి ఉంటుందనే సంకేతాలివ్వడం పట్ల ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు.  శాంతి కోసం భూభాగాన్ని వదులుకోబోమని తేల్చిచెప్పారు. 
 
రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదురుతుందని ట్రంప్‌ ఆశాభావం వ్యక్తంచేస్తూ  ”అందుకు (శాంతి ఒప్పందం కోసం) కొన్ని భూభాగాలు వెనక్కి తీసుకోవడం, మార్చుకోవడం జరుగుతుంది. ఇరుపక్షాలకు మేలు జరిగేలా ఈ భూభాగాల మార్పిడి ఉంటుంది” అని వెల్లడించారు.  అయితే, ఏయే ప్రాంతాలను మార్చుకుంటారు? ఎవరు ఏ భూభాగాలను తీసుకుంటారు? అనే వివరాలను ఆయన చెప్పలేదు. ట్రంప్‌-పుతిన్‌ భేటీ వార్తలపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
”ఉక్రెయిన్‌ ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీసే చర్చలను ఆమోదించబోం. శాంతి స్థాపన కోసం నిర్వహించే సమావేశాల్లో మా గళాన్ని వినిపిం చాల్సిందే. అంతేగానీ, ఆక్రమణ దారులకు ఉదారంగా మా భూభాగాన్ని వదులుకోలేం. ఉక్రెయిన్‌ లేకుండా జరిపే చర్చల్లో ఏ పరిష్కారాలు నిర్ణయించినా అవన్నీ శాంతికి వ్యతిరేకమే. వాటితో సమస్య తీరదు. ఆ నిర్జీవ పరిష్కారాలు ఏమాత్రం పనిచేయవు” అని జెలెన్‌స్కీ మండిపడ్డారు.
 
కాగా, రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్‌ పుతిన్‌తో ఆగష్టు 15న అలస్కాలో భేటీ కానున్నట్లు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ట్రంప్‌ తన సామాజిక మాధ్యమం ట్రూ సోషల్‌లో ” అమెరికా అధ్యక్షుడుగా నేను, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో అలస్కాలో సమావేశం కానున్నాం. దీనికి ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నా. మరిన్ని విషయాలు త్వరలో వెల్లడిస్తాం ” అని తెలిపారు. ఈ సమావేశంలో రష్యా , ఉక్రేయిన్‌ల మధ్య కాల్పుల విరమణపై ప్రదానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
 
మరోవంక, రష్యా, ఉక్రెయిన్‌ శాంతి చర్చల్లో పురోగతి సాధిస్తున్నట్లు ట్రంప్‌ తెలిపారు . “గత నెలన్నరలో రష్యా దాదాపు 25 వేల మందిని కోల్పోయింది. ఉక్రెయిన్‌ చాలా నష్టపోయింది. చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మేము ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నాం. భూభాగాల మార్పిడిపై చర్చిస్తాం. త్వరలో పూర్తి వివరాలు ప్రకటిస్తాం” అని ప్రకటించారు. 
 
“నాటో ద్వారా యూరప్‌ దేశాలతో కలిసి పనిచేస్తున్నాం. వారు అద్భుతమైన నాయకులు. నాటో బడ్జెట్‌ను 2% నుంచి 5%కు పెంచడానికి అంగీకరించింది” అని ఆయన తెలిపారు. 
మరోవైపు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందిస్తూ తమ దేశ సమగ్రతను దెబ్బతీసే ఏ చర్యను మేము అంగీకరించం, మా గళం లేని సమావేశం పరిష్కారం చూపదు, ఉదారంగా మా భూభాగాన్ని వదులుకోమని స్పష్టం చేశారు.