
ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో రొయ్యల ఉత్పత్తి, ఎగుమతులలో అగ్రగామి రాష్ట్రం. దేశవ్యాప్తంగా పండించే మొత్తం రొయ్యలలో సుమారు 70% ఈ రాష్ట్రం నుంచే వస్తుంది. సముద్ర ఆహార ఎగుమతుల్లో దాదాపు 32-33% విలువను ఆంధ్రప్రదేశ్ ఒక్కదానే అందిస్తుంది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాలు రొయ్యల ఉత్పత్తి కేంద్రాలుగా పేరుగాంచాయి. ఈ ఉత్పత్తి ప్రధానంగా అమెరికా, యూరప్, జపాన్ వంటి దేశాలకు ఎగుమతి అవుతుంది.
అయితే ఇటీవల అమెరికా ప్రభుత్వం భారతీయ రొయ్యలపై 25% కొత్త సుంకాన్ని విధించింది. ఇది ఇప్పటికే ఉన్న యాంటీ-డంపింగ్ డ్యూటీలు, కౌంటర్‌వైలింగ్ డ్యూటీలకు అదనంగా రావడంతో, మొత్తం రుసుము 30-37% వరకు పెరిగింది. ఈ భారీ సుంకాల కారణంగా అమెరికా మార్కెట్లో భారత రొయ్యల ధర పోటీ శక్తి కోల్పోతుంది. ఎక్వడార్, వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలు తక్కువ రుసుములతో (10-13%) రొయ్యలను అమెరికాకు సరఫరా చేయగలుగుతున్నందున, కొనుగోలుదారులు ఆ దేశాల వైపు మళ్లుతున్నారు.
ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌పై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. అమెరికా మార్కెట్లో డిమాండ్ తగ్గిపోవడంతో ఎగుమతిదారులు కొనుగోలు ఆర్డర్లను తగ్గించారు. దీని ఫలితంగా రాష్ట్రంలోని రైతులు మార్కెట్లో తక్కువ ధరలకు అమ్మకానికి గురవుతున్నారు. సాధారణంగా ఎగుమతి ధర కిలోకు రూ. 270- రూ. 300 వరకు ఉండగా, ఇప్పుడు రూ. 220- రూ. 230కి పడిపోయింది. ఈ తగ్గుదల కిలోకు రూ. 40 రూ.నష్టం కలిగిస్తుంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో సుమారు మూడు లక్షల మంది రొయ్యల సాగులో నేరుగా ఉపాధి పొందుతుండగా, ప్యాకింగ్, ప్రాసెసింగ్, ఐస్ తయారీ, రవాణా, ఫీడ్ ఉత్పత్తి వంటి అనుబంధ రంగాల్లో మరికొన్ని లక్షల మంది ఆధారపడుతున్నారు. ధరలు పడిపోవడం వల్ల రైతులు పెట్టుబడులు తిరిగి తెచ్చుకోలేక అప్పుల బారిన పడే ప్రమాదం ఉంది. ఎగుమతులు తగ్గిపోతే ప్రాసెసింగ్ యూనిట్లు కూడా తక్కువ సామర్థ్యంతో పనిచేయవలసి వస్తుంది, ఫలితంగా ఉపాధి కోతలు తప్పవు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, స్థానిక వినియోగాన్ని పెంచేందుకు రొయ్యల రీబ్రాండింగ్, అంతర్గత మార్కెటింగ్, ఎగుమతి మార్కెట్ల వైవిధ్యీకరణ వంటి చర్యలను పరిశీలిస్తోంది. అయితే అమెరికా మార్కెట్ ఆంధ్రప్రదేశ్ రొయ్యల పరిశ్రమకు కీలకమైనదే కాబట్టి, ఈ సుంకాల ప్రభావం దీర్ఘకాలంగా కొనసాగితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన దెబ్బ తగులుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
More Stories
యూరియా ఎక్కువ వాడితే కాన్సర్… వాడకం తగ్గిస్తే కట్టకు రూ. 800
మహిళల నేతృత్వంలో అభివృద్దే `వికసిత భారత్’కు పునాది
వైసీపీ అవినీతి పాలనకు బాబు, మోదీ చరమగీతం