
ఓట్ల చోరీ ఆరోపణలపై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లిఖితపూర్వక అఫిడవిట్ ను ఇవ్వకపోవడంపై మండిపడుతూ ఎన్నికల సంఘంపై నమ్మకం లేకపోతే తన పదవికి రాజీనామా చేయాలని బిజెపి డిమాండ్ చేసింది. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఈసీపై నమ్మకం లేకుంటే తమ పదవులకు రాజీనామా చేయాలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా స్పష్టం చేశారు.
“రాహుల్ గాంధీ మీడియా ముందుకు వచ్చి నిరాధారమైన ఆరోపణలు చేస్తారు. కానీ రాజ్యాంగబద్ధమైన సంస్థ సాక్ష్యాలు, లిఖితపూర్వక ప్రకటన అడిగితే నిరాకరిస్తారు. అలాగే ఎన్నికల సంఘం నిజాయితీపై ఎలాంటి సందేహం లేదని, సంవత్సరాలుగా నిష్పక్షపాత సంస్థగా పేరు తెచ్చుకుందని సుప్రీంకోర్టు గమనించింది. (గతంలోని సుప్రీం కోర్టు తీర్పులను ప్రకారం)” అని తెలిపారు.
“రాహుల్ గాంధీ మీకు ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై నమ్మకం లేకపోతే ఒక పని చేయండి. ముందుగా మీరు లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేయండి. ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ కూడా రాజీనామా చేయండి. ఎందుకంటే మీరు ఎన్నికల సంఘంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు” అని భాటియా ఎద్దేవా చేశారు.
రాహుల్ గాంధీ ఓటు ఛోరీ వాదనను అబద్ధమని భాటియా అభివర్ణించారు. అశాంతికర శక్తి రాహుల్ ఇప్పుడు విధ్వంసకుడుగా మారాడని మండిపడ్డారు. ఆయన రాజ్యాంగాన్ని, భారత ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈసీ అధికారులను బెదిరించడం ద్వారా రాజ్యాంగ సంస్థలపై యుద్ధం మొదలుపెట్టారని భాటియా విమర్శించారు.
ఇక కాంగ్రెస్ పాలిత కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు కూడా రాజీనామా చేయాలని గౌరవ్ భాటియా హితవు చెప్పారు. ఎందుకంటే వారి పార్టీ ప్రధాన నాయకులకు ఎన్నికల సంఘంపై నమ్మకం లేదని తెలిపారు. మీకు అనుకూలంగా ఉంటే ఆమోదిస్తారు, అసౌకర్యంగా ఉంటే తిరస్కరించి ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేస్తారని ఆరోపించారు. అలాంటివి పనిచేయవని అని తేల్చి చెప్పారు.
కాగా, బీహార్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే రాహుల్ గాంధీ ఓట్ల చోరీ ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర మంత్రి ప్రతాప్ రావు జాదవ్ ఆరోపించారు. “భారత్ ప్రజాస్వామ్య పాలనలో ఉంది.ఎన్నికల సంఘం దానికి ముఖ్యమైన స్తంభం. ఎవరైనా తమకు న్యాయం జరగడం లేదని భావిస్తే, వారు సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చు” అని హితవు చెప్పారు.
“ఎన్నికలు సంఘం అఫిడవిట్ సమర్పించమని అడిగితే పార్లమెంట్లో ప్రయాణం చేశానని చెబుతున్నారు. ఆయన స్వయంగా తనను తానే ఇబ్బందుల్లోకి నెట్టుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలిచినప్పుడు ఈసీని ప్రశంసించారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక ఆరోపణలు మొదలుపెట్టారు” అని జాధవ్ విమర్శించారు.
More Stories
జీఎస్టీ సంస్కరణలు పొదుపు పండుగ లాంటిది
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం