తిరంగా యాత్రలు, మౌన ర్యాలీలతో స్వాతంత్య్ర వేడుకలు

తిరంగా యాత్రలు, మౌన ర్యాలీలతో స్వాతంత్య్ర వేడుకలు

రేపటి నుంచి ఏపీవ్యాప్తంగా తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్  తెలిపారు. శనివారం మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి బీజేపీ నేతలతో పీవీఎన్ మాధవ్ ఆడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాధవ్ మీడియాతో మాట్లాడారు.  ఆగస్టు 14వ తేదీ నుంచి దేశ విభజన గాయాన్ని పురస్కరించుకుని మౌన ప్రదర్శనలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

రేపటి నుంచి మండల, జిల్లా స్థాయిలో తిరంగా ర్యాలీ నిర్వహించాలని సూచించారు పీవీఎన్ మాధవ్. ఆజాదికా అమృత మహోత్సవం నుంచి బీజేపీ పరంగా ప్రతి సంవత్సరం తిరంగాయాత్రలు నిర్వహిస్తున్నామని చెప్పారు.  ఆదివారం నుంచి 14వ తేదీ వరకు తిరంగాయాత్రలు చేపడుతున్నట్లు తెలిపారు. తిరంగాయాత్రలు నిర్వహిస్తూ స్థానికంగా స్వాతంత్య్ర సమర యోధుల విగ్రహాలను పరిశుభ్రం చేయాలని సూచించారు.

స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబాల వద్దకు వెళ్లి అక్కడ స్వాతంత్య్ర సమర యోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించాలని దిశానిర్దేశం చేశారు పీవీఎన్ మాధవ్ . వీర మరణం పొందిన సైనికుల కుటుంబాలను పరామర్శించి, అంజలి ఘటించాలని సూచించారు. ఆగస్టు 14వ తేదీ దేశ విభజన జరిగిన రోజును.. ఒక కాళరాత్రిగా జాతీయ వాదులం అందరం భావిస్తామని చెప్పుకొచ్చారు.

అందువల్ల ఆ రోజు జిల్లా స్థాయిలో విభజన సమయంలో ఏర్పడిన పరిస్థితులపై ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని మార్గనిర్దేశం చేశారు.  ఈనెల(ఆగస్టు) 14వ తేదీ సాయంత్రం క్యాండిల్ లేదా కాగడాలను చేతబూని మౌన ర్యాలీలు నిర్వహించి ర్యాలీ అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడాలని సూచించారు పీవీఎన్ మాధవ్. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున యువత, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేసే విధంగా కార్యాచరణ రూపొందించాలని మాధవ్ పిలుపునిచ్చారు.

ఈ నెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జాతీయ జెండాను బీజేపీ శ్రేణులు తమ ఇళ్లపై కుటుంబ సభ్యులతో కలసి పతాక ఆవిష్కరణలు చేసి సెల్ఫీ తీసుకోవాలని సూచించారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో, బహిరంగ ప్రదేశాల్లో పతాక ఆవిష్కరణలకు స్థానికులను భాగస్వామ్యం చేసి ఒక పండుగ వాతావరణంలో ఆగస్టు 15 వేడుకలు నిర్వహించాలని పీవీఎన్ మాధవ్ సూచించారు.