పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ సమయంలో ఐదు పాక్ యుద్ధ విమానాలను కూల్చేసినట్లు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తాజాగా వెల్లడించింది. వాటితోపాటు రెండు వైమానిక స్థావరాలను కూడా ధ్వంసం చేసినట్లు ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ వెల్లడించారు. బెంగళూరులో ఎయిర్ మార్షల్ కాత్రే వార్షిక వేడుకలో పాల్గొన్న ఎయిర్ చీఫ్ మార్షల్ పక్కా ప్రణాళికతో ఆపరేషన్ సిందూర్ నిర్వహించామని చెప్పారు.
“ఈ ఆపరేషన్‌తో పాక్‌కు స్పష్టమైన సందేశాన్నిచ్చాం. సిందూర్ సమయంలో పాక్‌కు చెందిన ఐదు ఫైటర్‌జెట్స్‌ను కూల్చేశాం. వాటితోపాటు ఓ పెద్ద విమానాన్ని కూడా కూల్చేశాం. రెండు వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాం. మన ఎస్-400 రక్షణ వ్యవస్థ, డ్రోన్ వ్యవస్థలు సమర్థవంతంగా పని చేశాయి” అని ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్ తెలిపారు.
మన సైన్యం దాడి చేసిన పాక్ ప్రధాన ఎయిర్‌ఫీల్డ్‌లలో షహబాజ్ జకోబాబాద్ స్థావరం ఒకటిగా తెలిపారు. అక్కడ ఎఫ్-16 హ్యాంగర్ ఉందని వెల్లడించారు. అయితే మన సైన్యం దాడితో అది సగానికి పైగా దెబ్బతిందని తెలిపారు. అక్కడ కొన్ని యుద్ధ విమానాలు ఉన్నాయని తెలిపారు. అవి కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయని మేం అంచనాకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఆపరేషన్ సమయంలో మన గగనతల రక్షణ వ్యవస్థ, ఎస్-400 క్షిపణి వ్యవస్థ సమర్థంగా పనిచేశాయంటూ వివరించారు.
పాకిస్థాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా భారత్ చేపట్టిన ఆపరేషన్‌లో పాక్‌లోని బహవల్‌పూర్‌లో గల జైషే ఉగ్రసంస్థ ధ్వంసమైన ఫొటోలను కూడా ప్రదర్శించారు. దాడికి ముందు దాడి తర్వాత దృశ్యాలను మీడియాకు చూపించారు.
“మన వైమానిక కేంద్రాలపై దాడుల భయం ఉండేది. అందుకే రాత్రీపగలు అని చూడకుండా మనం స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈసారి ప్రత్యర్థి (పాకిస్థాన్) సాధారణ ఆయుధాలే కాకుండా సుదూర లక్ష్యాలను చేధించే ఆయుధాలను కూడా ఉపయోగించారు. వారి (పాక్) యుద్ధ విమానాలు మన వైమానిక స్థావరాలను లక్ష్యం చేసుకునే ప్రయత్నంచేశాయి” అని తెలిపారు.
“ఈ సమయంలో మన గగనతల రక్షణ వ్యవస్థలు అద్భుతంగా పనిచేశాయి. ఇటీవలె మనం కొనుగోలు (రష్యా నుంచి) చేసిన ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ ఒక గేమ్ ఛేంజర్‌లా పనిచేసింది. ఈ వ్యవస్థ వల్లే వారి (పాక్) యుద్ధ విమానాలు మన దరిదాపులకు కూడా రాలేకపోయాయి” అని ఏపీ సింగ్ చెప్పారు. అది చాలా హై-టెక్ యుద్ధంగా అభివర్ణిస్తూ కేవలం 80-90 గంటల్లోనే లక్ష్యాల్లో చాలా వరకు సాధించామని తెలిపారు. యుద్ధం ఇలాగే కొనసాగితే భారీ మూల్యం తప్పదని వారికి (పాక్) అర్థమైందని, అందుకే కాళ్ల బేరానికి వచ్చి, చర్చలు జరుపుదామని సందేశమిచ్చినట్లు గుర్తుచేసుకున్నారు. తాము దానికి అంగీకరించామని ఏపీ సింగ్ తెలిపారు.
More Stories
రేపు మణిపూర్‌లో ప్రధాని మోదీ పర్యటన
భారత్‌ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!