శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతం

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతం

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరిగింది.  వరలక్ష్మీ వ్రతం సందర్భంగా వేకువజామున అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు. ఈ పర్వదినాన అమ్మవారు బంగారు చీరతో విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

అనంతరం శ్రీ పద్మావతీ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆస్థాన మండపానికి వేంచేపు చేసి పద్మపీఠంపై ఆశీనులను చేశారు. అక్కడ విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోతర శత నామావళి నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని రోజా, చామంతి, మల్లె, సంపంగి, తులసి, పన్నీరు ఆకు, మరువము, తామరపూలు, వృక్షి వంటి సాంప్రదాయ పుష్పాలతో అమ్మవారిని ఆరాధించారు.

ఈ సందర్భంగా అమ్మవారిని 9 గ్రంథులతో(నూలుపోగు) అలంకరించారు. ఒక్కో గ్రంథిని ఒక్కో దేవతకు గుర్తుగా ఆరాధించారు. భవిష్యోత్తర పురాణంలో వ్యాస భగవానుడు వరలక్ష్మీ వ్రతం పూజావిధానాన్ని, మహత్యాన్ని తెలియజేశారని ఆలయ అర్చకులు  శ్రీనివాస ఆచార్యులు తెలిపారు. పూర్వం శంకరుడు పార్వతిదేవికి ఈ వరలక్ష్మీ వ్రతం విశిష్ఠత, ఆచరించవలసిన విధానాన్ని తెలియ చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోందని చెప్పారు. 

 
త్రేతాయుగంలో కుండలినీ నగరంలో నివసించిన చారుమతి అనే భక్తురాలు వరలక్ష్మీ నోము ఆచరించి పొందిన ఫల ప్రదాన్ని ఈ సందర్భంగా వివరించారు.
తరువాత 12 రకాల వివిధ నైవేద్యాలను అమ్మవారికి నివేదించారు. అనంతరం మహా మంగళ హరతితో వరలక్ష్మీ వ్రతం ముగిసింది.  వరలక్ష్మీ వ్రతాన్ని భక్తులు వీక్షించేలా ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు అందించారు. 
 
ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా టిటిడికి చెందిన 52 ఆలయాల్లో 8 లక్షల గాజులు, 1.60 లక్షల కంకణాలు, 1.60 లక్షల పసుపు దారాలు, 1.60 లక్షల కుంకుమ ప్యాకెట్లు, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పుస్తక ప్రసాదాలను అందించామని టిటిడి ఈఓ శ్యామలరావు తెలిపారు.