ఓ వైపు అమెరికా- ఇరాన్ లమధ్య సయోధ్యకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్ మరోవైపు ఇరాన్ నుండి రక్షణకోసం సౌదీ అరేబియాకు భారీ ఎత్తున సైనికులను, యుద్ధ విమానాలను పంపుతుంది. గత ఏడాది సెప్టెంబర్ లో సౌదీ అరేబియాతో కుదుర్చుకున్న కీలక రక్షణ ఒప్పందంలో భాగంగా పాకిస్థాన్ సుమారు 13 వేల మంది సైనికులను, 10 నుంచి 18 వరకు ఫైటర్ జెట్లను సౌదీ అరేబియాకు పంపించింది.
ఈ బలగాలను సౌదీ తూర్పు సెక్టార్‌లోని కింగ్ అబ్దులజిజ్ ఎయిర్ బేస్‌లో మోహరించారు. పాకిస్థాన్ సైనిక బృందం, ఫైటర్ జెట్లు, సహాయక ఎయిర్‌క్రాఫ్ట్‌లు శనివారం సౌదీ ఎయిర్ బేస్‌లో ల్యాండ్ అయినట్లు సౌదీ అరేబియా రక్షణ శాఖ వెల్లడించింది. ఇరు దేశాల సైన్యం మధ్య సమన్వయాన్ని పెంపొందించడానికి, కార్యాచరణ సన్నద్ధతను మెరుగుపర్చడం, భద్రతను, స్థిరత్వాన్ని పటిష్టం చేయడమే లక్ష్యంగా ఈ మోహరింపు చేపట్టినట్లు సౌదీ రక్షణ శాఖ వెల్లడించింది.
ఓవైపు పాకిస్థాన్ యుద్ధ విమానాలు సౌదీలో దిగిన సమయంలోనే అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలకు ఇస్లామాబాద్ ఆతిథ్యం ఇవ్వడం గమనార్హం. ఓవైపు యుద్ధానికి ముగింపు పలకడానికి ప్రయత్నిస్తూనే పాక్ తన మిత్రదేశమైన సౌదీకి సైన్యాన్ని పంపించడం చర్చనీయాంశంగా మారింది. పాకిస్థాన్ సైన్యాన్ని తమ దేశానికి పంపించిన విషయాన్ని సౌదీ అరేబియా తాజాగా ప్రకటించినప్పటికీ పాకిస్థాన్ గత నెలలోనే ఎయిర్‌క్రాఫ్ట్‌లు, సైన్యాన్ని సౌదీకి పంపినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పాకిస్థాన్ క్షిపణి నిరోధక వ్యవస్థలను కూడా సౌదీకి పంపించినట్లు చెబుతున్నారు. సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్, పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ గత ఏడాది రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశారు. నాటో తరహాలో ఉన్న ఈ ఒప్పందం ప్రకారం ఒక దేశంపై దాడి జరిగినా సరే.. దాన్ని రెండు దేశాలపై జరిగే దాడిగా పరిగణిస్తారు. పాకిస్థాన్ అణ్వస్త్ర దేశం కావడంతో.. ఈ ఒప్పందం ద్వారా సౌదీకి ప్రయోజనం చేకూరుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ముప్పు తీవ్రతను బట్టి పాకిస్థాన్ నుంచి అన్ని రకాల రక్షణ, సైనిక సాయాన్ని సౌదీ పొందే అవకాశం ఉంటుంది. 1960ల నుంచే పాకిస్థాన్, సౌదీ అరేబియా మధ్య రక్షణ సంబంధాలు ఉన్నాయి. యెమెన్‌లో ఈజిప్టు యుద్ధం సమయంలో పాకిస్థాన్ తన బలగాలను సౌదీకి పంపించింది. 1979లో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయి. ప్రస్తుతం ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకున్నాయి. ఈ పరిస్థితుల్లో సౌదీ, పాక్ రక్షణ ఒప్పందం వైపు అందరి దృష్టి మళ్లింది.

More Stories
అణ్వాయుధాలు, హార్ముజ్ జలసంధిల పై చర్చలు విఫలం!
ప్రపంచ ఉగ్రవాద సూచికలో అగ్రగామి పాకిస్తాన్
అమెరికా- ఇరాన్ చర్చలు విఫలం