అరుణాచల్‌ ప్రాంతాలకు చైనా పేర్లపై భారత్‌ ఆగ్రహం

అరుణాచల్‌ ప్రాంతాలకు చైనా పేర్లపై భారత్‌ ఆగ్రహం

అరుణాచల్‌ప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు చైనా పేర్లు పెట్టడంపై భారత్‌ తీవ్రంగా మండిపడింది. చైనా చేస్తున్న ఈ తరహా ప్రయత్నాలను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్లు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. భారత భూభాగంలోని ప్రాంతాలకు కల్పిత పేర్లు పెట్టడం ద్వారా చైనా సృష్టిస్తున్న అబద్ధపు కథనాలు ఏమాత్రం చెల్లవని తేల్చి చెప్పింది. ఇటీవల లదాఖ్‌లోని రెండు ప్రదేశాలను హీన్, హెకాంగ్‌ అంటూ చైనా తన భూభాగంగా పేర్కొనడంపై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘‘భారత సరిహద్దులోని ప్రదేశాల విషయంలో పేర్లు మారుస్తూ చైనా చేస్తున్న ఇలాంటి తప్పుడు పనుల్ని భారత్ ఖండిస్తోంది. తప్పుడు ఉద్దేశాలతో చైనా చేసే ఇలాంటి పనులు వాస్తవాల్ని దాచి ఉంచలేవు. అరుణాచల్ ప్రదేశ్‌ సహా సరిహద్దు ప్రదేశాలు భారత్ లో భాగం అనే సత్యాన్ని కాదనలేం. ఇవి సమగ్రమై, భారత్ నుంచి విడదీయలేని ప్రదేశాలు” అని స్పష్టం చేశారు. 

అరుణాచల్‌ప్రదేశ్‌ భారత్‌లో అంతర్భాగమని, భవిష్యత్తులోనూ భారత్‌లో భాగంగానే ఉంటుందని చెప్పారు. పేర్లు మార్చినంత మాత్రాన వాస్తవాలను మార్చలేరని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను సాధారణ స్థితికి తెచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు ఈ చర్యలు అడ్డంకిగా మారుతున్నాయని జైస్వాల్ హెచ్చరించారు. ఇటువంటి చర్యలు భారత్‌-చైనా సంబంధాల్లో ప్రతికూలతను నింపుతాయని పేర్కొన్నారు.  పరస్పర అవగాహనను పెంపొందించుకునే ప్రయత్నాలను దెబ్బతీసే పనులకు చైనా స్వస్తి పలకాలని రణధీర్‌ జైశ్వాల్‌ హితవు పలికారు.

అంతకుముందు లద్ధాఖ్ ప్రాంతానికి సమీపంగా చైనా  షిన్జియాంగ్ ప్రాంతంలో సెన్లింగ్ అనే కొత్త కౌంటీని ఏర్పాటు చేయడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.  కారాకోరం పర్వత శ్రేణులకు సమీపంలో, అఫ్గానిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ సరిహద్దులకు దగ్గరగా ఈ ప్రాంతం ఉండటం వ్యూహాత్మకంగా కీలకమైంది. గత ఏడాది కాలంలోనే చైనా షిన్‌జియాంగ్‌లో మూడు కొత్త కౌంటీలను ఏర్పాటు చేయడం గమనార్హం. అయితే, హీన్, హెకాంగ్ అనే కౌంటీల ఏర్పాటుపై భారత్ ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఈ ప్రాంతాల్లోని కొన్ని భాగాలు వాస్తవానికి లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతంలోకి వస్తాయని భారత్ వాదిస్తోంది. మరోవైపు, కాష్గర్ ప్రాంతం చారిత్రకంగా సిల్క్ రోడ్‌కు కీలక కేంద్రంగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఇది చైనా, దక్షిణ ఆసియా, మధ్య ఆసియా మధ్య వాణిజ్య సంబంధాలకు ముఖ్య కేంద్రంగా ఉంది. అంతేకాకుండా, చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్ (సిపిఈసీ) ప్రాజెక్ట్ కూడా ఇక్కడి నుంచే ప్రారంభమవుతోంది. ఈ ప్రాజెక్ట్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా వెళ్తుండటంపై భారత్ ఇప్పటికే పలుమార్లు అభ్యంతరం తెలిపింది.