హైడ్రా పేరుతో గిరిజన ఇళ్లపై దాడి

హైడ్రా పేరుతో గిరిజన ఇళ్లపై దాడి
పఠాన్ చెరువు, అమీన్ పూర్, ఐలాపూర్ తండాలలో అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఎటువంటి నోటీసులు లేకుండా హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అమానవీయ పాలనకు పరాకాష్ట అని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. కళ్యాణ్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  హైకోర్టు సైతం ఈ వ్యవహారంపై మండిపడుతూ “ఇదేం పాలన? చట్టం ఉందా లేదా?” అని ప్రశ్నించాల్సిన పరిస్థితి రావడం రాష్ట్రంలో జరుగుతున్నది రాజ్యాంగబద్ధ పాలన కాదని స్పష్టం చేస్తోందని ఆయన తెలిపారు. 
 
“హైడ్రా” పేరుతో సాగుతున్నది అసలు అక్రమాల తొలగింపు కాదని, కాంగ్రెస్ మార్క్ దండయాత్ర అని ఆయన మండిపడ్డారు. పేదల గుడిసెలపై బుల్డోజర్లు ఎక్కించే ధైర్యం చూపుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, పాతబస్తీలో నాలాలు, ఫుట్‌పాత్‌లు ఆక్రమించి కట్టిన ఎంఐఎం నేతల నిర్మాణాల దగ్గరకు వచ్చేసరికి ఎందుకు మౌనం వహిస్తోంది? అని ప్రశ్నించారు. ఇది స్పష్టమైన ద్వంద్వ వైఖరి అని స్పష్టం చేశారు. 

సలకం చెరువుపై వెలిసిన ఓవైసీ బ్రదర్స్ కాలేజీ వంటి నిర్మాణాలను ముట్టుకోవడానికి చేతులు వణుకుతున్నాయా? అని డా. కళ్యాణ్ నాయక్ ఎద్దేవా చేశారు. పేదలపై మాత్రమే యాక్షన్ తీసుకుంటూ, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం సెలెక్టివ్ టార్గెటింగ్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అసలు స్వభావాన్ని బయటపెడుతోందని ఆయన మండిపడ్డారు.  గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన భూముల దందానే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రూపంలో కొనసాగిస్తోందని ఆయన విమర్శించారు.
ఆనాడు చెరువులను కబళించిన వారు ఈరోజు వాటాల కోసం “హైడ్రా”ను రాజకీయ ఆయుధంగా వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. అక్రమ నిర్మాణం ఎక్కడ ఉన్నా, ఎవరు చేసినా కూల్చాలన్నదే అని స్పష్టం చేశారు. అయితే చట్టం పేదలకు ఒకలా, ఎంఐఎం నేతలకు, అధికార పార్టీ పెద్దలకు మరోలా ఉండటం తీవ్ర అన్యాయం అని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

వాస్తవానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకే నాణేనికి రెండు బొమ్మలని చెబుతూ .  వాటాల కోసం కుస్తీ పడుతూ, బయట ప్రజలను మభ్యపెడుతూ తెలంగాణ భూములను బలి చేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. లోపాయికారీ ఒప్పందాలతో వాటాలు పంచుకుంటూ పేదలను బలిపీఠం ఎక్కిస్తున్నాయని అంటూ మండిపడ్డారు.  తెలంగాణ ప్రజల భూములను, చెరువులను కాపాడటానికి బదులు రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టడమే లక్ష్యంగా సాగుతున్న ఈ బుల్డోజర్ రాజకీయాన్ని బిజెపి తీవ్రంగా ఖండిస్తోందని స్పష్టం చేశారు. 

హైడ్రా పేరుతో గిరిజన ఇండ్లను కూల్చే కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆపాలని, లేనిపక్షంలో బీజేపీ మౌనం వహించదని హెచ్చరించారు. అర్హులైన గిరిజనులకు వెంటనే ఇళ్లను కేటాయించి, వారి భూములను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.