ఇస్లామాబాద్‌లో దాదాపు 21 గంటల పాటు జరిగిన చర్చలు ఒప్పందం లేకుండా ముగిసిన తర్వాత, చర్చలు ఎందుకు విఫలమయ్యాయనే దానిపై వాషింగ్టన్, టెహ్రాన్ల యు నుండి పరస్పర విరుద్ధమైన కథనాలు వెలువడ్డాయి. అమెరికా డిమాండ్ల కారణంగానే చర్చలు విఫలమయ్యాయని ఇరాన్ ప్రభుత్వం మీడియా పేర్కొంది. సుమారు 21 గంటల పాటు చర్చల్లో దౌత్యపరమైన ప్రయత్నాలు జరిగాయని తెలిపింది. కానీ అమెరికా డిమాండ్లు ఒప్పందాన్ని కుదరకుండా అడ్డుకున్నాయని చెప్పింది.
హర్మూజ్ జలసంధి, ఇరాన్ అణు హక్కులు వంటి కీలక అంశాలపై ప్రతిష్ఠంభన కారణంగానే ఇవి విఫలమయ్యాయని తెలిపింది. ఇలా ఉన్నతస్థాయిలో అమెరికా-ఇరాన్‌ల మధ్య ముఖాముఖీ చర్చలు జరగడం 1979 ఇస్లామిక్ విప్లవం తరువాత ఇదే మొదటిసారి! అమెరికా డిమాండ్లకు టెహ్రాన్ ‘ఖచ్చితంగా తిరస్కరించింది’ అని ఘనాలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఎక్స్ లో ఒక పోస్ట్‌లో పేర్కొంది. చర్చల నుండి వైదొలగడానికి వాషింగ్టన్ ‘ఒక సాకు వెతుకుతోందని’, ‘యుద్ధం ద్వారా సాధించలేని’ రాయితీలను కోరుకుంటోందని ఆరోపించింది.
ప్రపంచ ఇంధన మార్కెట్లను స్తంభింపచేసి వాణిజ్యానికి అంతరాయం కలిగించిన ప్రతిష్టంభన తొలగించి శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని అమెరికా ప్రతినిధి బృందం శనివారం ఇస్లామాబాద్‌లో ఇరాన్ ప్రతినిధులతో చారిత్రాత్మక ముఖాముఖీ చర్చలు జరిపింది.
మధ్యవర్తి దేశమైన పాకిస్తాన్‌కు చెందిన ఒక వర్గం తెలిపిన వివరాల ప్రకారం, అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్, ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ — ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాకర్ ఖాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరక్చీలు రెండు గంటలకు పైగా నేరుగా చర్చలు జరిపారు. ఈ రెండు బృందాలు తొలుత పాకిస్థాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్‌తో వేర్వేరుగా సమావేశమయ్యాయి.
అయితే ఈ చర్చలు విఫలమయ్యాయని జేడీ వాన్స్ తెలుపడంతో ఆందోళన కలిగిస్తున్నది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా నిబంధనలు అంగీకరించేందకు ఇరాన్ ఏమాత్రం సిద్ధంగా లేదని జేడీ వాన్స్ అసహనం వ్యక్తం చేశారు. అయితే, చర్చలు విఫలం కావడానికి ప్రధాన వివాదాంశాలు ఏమిటనే విషయాన్ని ఆయన వివరించలేదు. కానీ, వాటిలో అణు అంశం ఒకటి అని మాత్రం పేర్కొన్నారు.
ఇరాన్ అణ్వాయుధాలను గానీ, వాటిని సమకూర్చుకోవడానికి అవసరమైన సాధనాలను గానీ తయారుచేయదనే హామీలు అమెరికాకు అవసరమని ఆయన తెలిపారు. అయినప్పటికీ, అమెరికా వైఖరి చాలా “సరళంగానూ, సానుకూలంగానూ” ఉందని వాన్స్ పేర్కొన్నారు. ఇరాన్ ప్రతినిధి బృందంతో జరిగిన చర్చలు నిర్మాణాత్మకంగా సాగాయని జెడి వాన్స్ అభివర్ణించారు. “మేము గత 21 గంటలుగా నిరంతరాయంగా చర్చలు జరుపుతున్నాము.
ఇరాన్ ప్రతినిధులతో మేము అనేక కీలకమైన సంప్రదింపులు జరిపాము. అది శుభవార్త. అయితే, దుర్వార్త ఏమిటంటే—మేము ఇంకా ఏ ఒప్పందానికీ రాలేకపోయాము. ఈ పరిణామం అమెరికా కంటే ఇరాన్‌కే ఎక్కువ నష్టదాయకమని నేను భావిస్తున్నాను. మా షరతులను అంగీకరించకూడదని వారు నిర్ణయించుకున్నారు,” అని ఆయన మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు.

More Stories
ప్రపంచ ఉగ్రవాద సూచికలో అగ్రగామి పాకిస్తాన్
అంతరిక్ష పోటీలో రష్యా వెనకడుగు.. చంద్రయానం మరోసారి వాయిదా
తరతరాలుగా స్ఫూర్తిని అందిస్తున్న ఓ పవిత్ర భూమి కందకుర్తి