* డాక్టర్జీ పూర్వీకుల గ్రామంలో శ్రీ కేశవ్ స్ఫూర్తి మందిరం ప్రారంభించిన భగవత్
కందకుర్తి తరతరాలుగా స్ఫూర్తిని అందిస్తున్న ఒక పవిత్ర భూమి అని వర్ణిస్తూ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ శనివారం సంఘ్ సంస్థాపకులు డా. కేశవ్ బలీరామ్ హెడ్గేవార్ పూర్వీకుల గ్రామంలో కొత్తగా నిర్మించిన శ్రీ కేశవ్ స్ఫూర్తి మందిరాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమం కేవలం ఒక స్ఫూర్తి మందిరం ప్రారంభోత్సవం మాత్రమే కాదు, కందకుర్తి నేలలో పాతుకుపోయిన వారసత్వాన్ని పునరుద్ఘాటించడం కూడా అని, ఇది జాతీయ ఆలోచనలకు, కార్యాచరణకు స్ఫూర్తినిస్తూనే ఉందని డాక్టర్ మోహన్ భగవత్ తెలిపారు. కందకుర్తి కేవలం ఒక వంశ జన్మస్థలం మాత్రమే కాదని, అది ఒక చైతన్య భూమి అని, దీనికి ఒక లోతైన ప్రతీకాత్మక సంబంధం ఉందని ఆయన స్పష్టం చేశారు.
గ్యాలరీలోని ఒక చిత్రపటాన్ని ప్రస్తావిస్తూ, గరుడుడు తన తల్లి వినతను విముక్తి చేసిన కథ కూడా ఈ భూమితో ముడిపడి ఉందని, భారత్ మాతను బానిస సంకెళ్ల నుండి విడిపించాలన్న డాక్టర్‌జీ సంకల్పంతో దీనిని పోల్చారు. చిన్నతనం నుంచే డాక్టర్జీ దేశాన్ని విదేశీ పాలన నుండి విముక్తి చేయాలనే దృఢ సంకల్పంతో, అచంచలమైన చిత్తశుద్ధితో, నిస్వార్థంగా పనిచేశారని ఆయన పేర్కొన్నారు.
స్ఫూర్తి మందిరాన్ని జాతీయ చైతన్య కేంద్రంగా అభివర్ణిస్తూ, ఇలాంటి ప్రదేశాలు భవిష్యత్ తరాలను సమాజానికి, దేశానికి తమను తాము అంకితం చేసుకునేలా ప్రేరేపించాలని డాక్టర్ మోహన్ భగవత్ అభిలాష వ్యక్తం చేశారు. “కందకుర్తి కేవలం గతం తాలూకు ప్రదేశం మాత్రమే కాదు. అది స్ఫూర్తికి సజీవ మూలం,” అని ఆయన సూచించారు. ఈ నేల నుండి వచ్చిన వారసత్వం జాతీయ ఆలోచనకు మార్గనిర్దేశం చేస్తూ, దానిని తీర్చిదిద్దుతూనే ఉందని ఆయన తెలిపారు.
ప్రజలు కందకుర్తిని క్రమం తప్పకుండా సందర్శించాలనే దృఢ సంకల్పం మనం తీసుకోవాలి, ఎందుకంటే ఈ పవిత్ర భూమి తరతరాలకు స్ఫూర్తినిస్తూ, దేశం పట్ల మన కర్తవ్య భావాన్ని బలపరుస్తుందని చెప్పారు. డాక్టర్జీ పూర్వీకుల గ్రామంగా గుర్తించిన కందకుర్తి, ప్రగాఢమైన చారిత్రక, భావోద్వేగ ప్రాముఖ్యతను కలిగి ఉంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆవిర్భవించిన కర్మభూమి నాగ్‌పూర్ అయినప్పటికీ, కందకుర్తి దాని మూలస్థానానికి — అంటే పునాదికి ప్రతీక అని డాక్టర్ భగవత్ నొక్కి చెప్పారు.
నాగ్‌పూర్‌లోని స్మృతి మందిరం దేశవ్యాప్తంగా ప్రజలను ఆకర్షిస్తున్నట్లే, కందకుర్తిలో కూడా డాక్టర్‌జీ జ్ఞాపకాలను, స్ఫూర్తిని ప్రతిబింబించే ఒక కేంద్రం ఉండటం సహజమని ఆయనతెలిపారు. ఈ ఆలోచన 32 ఏళ్ల క్రితమే రూపుదిద్దుకుందని చెబుతూ సరిగ్గా అదే తేదీన — ఏప్రిల్ 11న — ఇప్పుడు అది కార్యరూపం దాల్చిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
డాక్టర్ భాగవత్ ‘శ్రీ కేశవ స్ఫూర్తి మందిరాన్ని’ ప్రారంభించారు. డాక్టర్జీ జీవితం, కృషిని వివరించే సవివరమైన దృశ్య కథనాల ద్వారా రూపొందించిన గ్యాలరీలను ఆయన సందర్శించారు. ఈ కళా గ్యాలరీ హెడ్గేవార్ జీవితం, విలువలు, ఆయన చేసిన సేవలను సమగ్రంగా కళ్ళకు కడుతుంది. ఆవరణలో ఉన్న కేశవ మూర్తి, రుక్మిణీ సమేత విఠలేశ్వర, స్కంద ఆలయాలను కూడా ఆయన సందర్శించారు.
సందర్శన అనంతరం, ఆయన తన అభిప్రాయాలను సందర్శకుల పుస్తకంలో నమోదు చేశారు. మందిర నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజనీర్లు, వాస్తుశిల్పులు, కళాకారులు, కార్మికులతో సహా వివిధ భాగస్వాములను ఈ కార్యక్రమంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సైయంట్ సంస్థ వ్యవస్థాపకులు, కార్యనిర్వాహక చైర్మన్ డాక్టర్ బి. వి. ఆర్. మోహన్ రెడ్డి, చామకూర సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్థానిక పార్లమెంటు సభ్యులు, శాసనసభ సభ్యులు, రాష్ట్రానికి చెందిన ఆర్ఎస్ఎస్ సీనియర్ ప్రచారకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

More Stories
అంతరిక్ష పోటీలో రష్యా వెనకడుగు.. చంద్రయానం మరోసారి వాయిదా
అమెరికా- ఇరాన్ చర్చలు విఫలం
మహిళా రిజర్వేషన్ల బిల్లుకు పార్టీలకు అతీతంగా మద్దతు