* సముద్ర గర్భంలో అమర్చిన మందు పాతరల జాడలు మర్చిపోయిన ఇరాన్
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత హర్మూజ్ జలసంధిని దాటిన భారత తొలి ఎల్పీజీ ట్యాంకర్‌గా జగ్ విక్రమ్ నిలిచింది. ఎల్పీజీ ట్యాంకర్ జగ్ విక్రమ్ గల్ఫ్ నుంచి భారీ ఎల్పీజీ లోడ్‌తో భారత్‌కు బయల్దేరింది. సురక్షితంగా హర్మూజ్ జలసంధిని దాటింది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత జలసంధిని దాటిన ఈ నౌక మధ్యాహ్నానికి గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లోకి ప్రవేశించింది.
ఈ గ్యాస్ ట్యాంకర్ 20 వేల టన్నుల ఎల్పీజీని తీసుకురానుంది. జలసంధిని దాటడానికి అనుమతి కోసం జగ్ విక్రమ్ వారం రోజులకుపైగా గల్ఫ్ జలాల్లో ఎదురుచూసినట్లు షిప్పింగ్ డేటా నివేదికలు వెల్లడించాయి. ఈ ట్యాంకర్ ముంబైలోని గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ యాజమాన్యానికి చెందినదిగా తెలుస్తున్నది.
మరో 15 భారత రిజిస్టర్డ్ నౌకలు పర్షియన్ గల్ఫ్‌లోనే ఉన్నాయని, త్వరలో అవి కూడా ఇదే మార్గం గుండా భారత్‌కు చేరుకునే అవకాశం ఉందని నివేదికలు పేర్కొన్నాయి. ఆ 15 నౌకల్లో ఒకటి ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్, నాలుగు ముడి చమురు ట్యాంకర్లు, ఒక ఎల్ఎన్జీ ట్యాంకర్, ఒక రసాయన ఉత్పత్తుల ట్యాంకర్, మూడు కంటైనర్ నౌకలు, రెండు బల్క్ క్యారియర్లు, మూడు ఇతర నౌకలు ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవంక, అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధం సందర్భంగా సముద్ర గర్భంలో అమర్చిన మందు పాతరలను(సీమైన్స్) గుర్తించి, తొలగించడంలో ఇరాన్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న కారణంగా హొర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అమెరికా అధికారులను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. సీమైన్స్ని గుర్తించి, తొలగించడానికి ఇరాన్‌కు ఉన్న పరిమిత సామర్థ్యం జలసంధి తిరిగి తెరవకుండా నిరోధిస్తున్న కీలక అంశమని వార్తాకథనం పేర్కొన్నది.

More Stories
ఆర్టెమిస్-2 వెనుక భారతీయ సంతతి శాస్తస్రవేత్త అమిత్ క్షత్రియా
చంద్రుడిని చుట్టి భూమికి చేరిన ఆర్టెమిస్-2 వ్యోమగాములు
మొక్కుబడిగానే ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ చర్చలు?