మళ్లీ లాభాల బాటలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు

మళ్లీ లాభాల బాటలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు గత వారం మళ్లీ లాభాల బాటపట్టాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్లకు మదుపర్ల నుంచి వచ్చిన కొనుగోలు మద్దతుతో పాటు అంతర్జాతీయ పరిణామాలు సానుకూలంగా మారడంతో సూచీలు బలపడ్డాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, క్రూడాయిల్‌ ధరలు దిగివస్తుండటం మార్కెట్‌ సెంటిమెంట్‌కు ఊతమిచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

ట్రేడింగ్‌ ముగిసే సమయానికి 30 షేర్ల సూచీ సెన్సెక్స్‌ 918.60 పాయింట్లు (1.20%) ఎగబాకి 77,550.25 వద్ద ముగిసింది. ఒక దశలో ఇది వెయ్యి పాయింట్లకు పైగా పెరిగింది. మరోవైపు నిఫ్టీ 275.50 పాయింట్లు (1.16%) పెరిగి 24,050.60 వద్ద స్థిరపడింది. రంగాలవారీగా చూస్తే బ్యాంకింగ్‌, ఆటో, క్యాపిటల్‌ గూడ్స్‌, కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ రంగాలు మంచి ప్రదర్శన కనబరిచాయి. 

ముఖ్యంగా వాహన రంగ సూచీ 2.75% పెరిగి అగ్రస్థానంలో నిలిచింది. బ్యాంకింగ్‌ సూచీ కూడా 2.06% లాభపడింది. అదే సమయంలో ఐటీ, దాని అనుబంధ రంగాల్లో మాత్రం అమ్మకాలు నమోదై నష్టాలు చవిచూశాయి. షేర్ల వారీగా  ఏషియన్‌ పెయింట్స్‌ సుమారు 4% పెరిగి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్బీఐ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ వంటి ప్రధాన షేర్లు 2%కు పైగా లాభపడ్డాయి. 

మరోవైపు ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టెక్‌ మహీంద్రా, సన్‌ఫార్మా షేర్లు ఒత్తిడికి లోనయ్యాయి. వారాంతపు  మార్కెట్‌ ప్రదర్శన గణనీయంగా మెరుగుపడింది. ఈ వారం మొత్తం సెన్సెక్స్‌ 4,230.7 పాయింట్లు (5.77%) లాభపడగా, నిఫ్టీ 1,337.50 పాయింట్లు (5.88%) ఎగబాకింది.  అదే సమయంలో స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ సూచీలు కూడా వరుసగా 1.64%, 1.50% పెరిగాయి. మొత్తం మీద గ్లోబల్‌ సంకేతాలు అనుకూలంగా మారడం, చమురు ధరల తగ్గుదల, బ్యాంకింగ్‌ రంగంలో కొనుగోళ్లు పెరగడం వంటి అంశాలు మార్కెట్‌ ర్యాలీకి ప్రధాన కారణాలుగా నిలిచాయి.