జూన్ 3 నుంచి అమర్‌నాథ్ యాత్ర

జూన్ 3 నుంచి అమర్‌నాథ్ యాత్ర
ప్రతి ఏటా హిందూ భక్తులు ఎంతో ఆశగా ఎదురుచూసే అమర్‌నాథ్ యాత్ర 2026 షెడ్యూల్ విడుదలైంది. దక్షిణ కాశ్మీర్‌లోని పరమ పవిత్ర గుహలో కొలువై ఉన్న మంచు లింగాన్ని దర్శించుకునేందుకు చేపట్టే ఈ యాత్ర జూలై 3 నుంచి ప్రారంభం కానుంది. ఈ వివరాల్ని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వెల్లడించారు.  శ్రీ అమర్‌నాథ్ జి ఆశ్రమ బోర్డుతో, ఎల్జీ సిన్హా అధ్యక్షతన జరిగిన సమావేశంలో యాత్ర తేదీలపై నిర్ణయం తీసుకున్నారు.
సిన్హా కార్యాలయం అయిన లోక్ భవన్ తెలిపిన వివరాల ప్రకారం జూలై 3న ప్రారంభమయ్యే అమర్‌నాథ్ యాత్ర 57 రోజులపాటు సాగుతుంది. అంటే, ఆగష్టు 28న ముగుస్తుంది. 13-70 ఏళ్ల వయసు గలవారు ఈ యాత్ర చేపట్టవచ్చు.  ఏప్రిల్ 15 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. దేశంలో వివిధ బ్యాంకులలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 556 కేంద్రాలలో భక్తులు ఈ యాత్రకు రిజిష్టర్ చేసుకోవచ్చు.
యెస్ బ్యాంక్, ఐసీఐసీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంకులలోని కొన్ని కేంద్రాలలో ఈ దరఖాస్తులు లభిస్తాయి. అలాగే, శ్రీ అమర్‌నాథ్ జి ఆశ్రమ బోర్డు వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో రిజిష్టర్ చేసుకోవచ్చు. ఈ యాత్రకు సంబంధించిన తొలి పూజ, జ్యేష్ట పూర్ణిమ సందర్భంగా జూన్ 19న జరుగుతుంది. ఈ యాత్ర రెండు మార్గాల్లో సాగుతుంది. ఒకటి అనంత్‌నాగ్ జిల్లాలోని 48 కిలోమీటర్ల సంప్రదాయ నున్వాన్-పహల్గాం మార్గం కాగా, రెండోది 14 కిలోమీటర్లు ఉండే బల్తాల్ మార్గం.