ఫూలేకు రాష్ట్రపతి, ప్రధాని నివాళులు

ఫూలేకు రాష్ట్రపతి, ప్రధాని నివాళులు

సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావ్‌పూలే 200వ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ తదితరులు నివాళులర్పించారు. శనివారం ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీతో కలిసి పార్లమెంటు ప్రాంగణంలోని ప్రేరణా స్థల్‌ వద్ద మహాత్మా జ్యోతారావ్‌ పూలే విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.

మహాత్మా జ్యోతిరావు ఫూలే తన జీవితాన్ని అణగారిన వర్గాల అభ్యున్నతికి అంకితం చేశారని ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము నివాళులు అర్పించారు. ఆయన మహిళా విద్యాభివృద్ధికి గణనీయమైన కృషి చేసి, సామాజిక సంస్కరణ, సమ్మిళితత్వానికి సంబంధించిన శాశ్వత వారసత్వాన్ని వదిలివెళ్లారని ఆమె కొనియాడారు. 

ఈ నివాళి కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ, కేంద్ర మంత్రులు అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌, జెపి నడ్డా, మాజీ రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌లు పాల్గొన్నారు.  కాగా, ఈ సందర్భంగా ‘సమానత్వం, న్యాయం, విద్య అనే ఆదర్శాలకు తన జీవితాన్ని అంకితం చేసిన దార్శనిక సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నాను. ఆయన మహిళలు, అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణలో మార్గదర్శకుడు’ అంటూ ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. 

“ఆయన కృషి వల్ల, విద్య సాధికారతకు ఒక శక్తివంతమైన సాధనంగా మారింది. ఈ సంవత్సరం మనం ఆయన 200వ జయంతి ఉత్సవాలను ప్రారంభిస్తున్నాము. సామాజిక ప్రగతి సాధనలో ఆయన ఆలోచనలు ప్రతి ఒక్కరికీ మార్గదర్శకంగా నిలవాలని ఆశిస్తున్నాము” అని వివరించారు.  ఈ సందర్భంగా పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో అరుదైన దృశ్యం చోటుచేసుకున్న‌ది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో ప్ర‌ధాని మోదీ కాసేపు మాట్లాడారు. దీంతో ఆ వీడియో ప్ర‌స్తుతం ఆన్‌లైన్‌లో వైర‌ల్ అవుతున్న‌ది.
కారు నుంచి దిగి వెళ్తున్న మోదీ కాసేపు ఆగి రాహుల్‌తో ముచ్చ‌టించారు.  రాష్ట్రపతి కోసం ఎదురు చూస్తున్న సమయంలో పార్ల‌మెంట్‌లో ఎప్పుడూ విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు చేసుకునే ఆ నేతలు మాటలు కలపడం పట్ల కాంగ్రెస్, బీజేపీ నేత‌లు కూడా  ఆస‌క్తి క‌న‌బ‌రిచారు.  ఈ సంభాషణ క్లుప్తంగానే జరిగినప్పటికీ, చాలా సందర్భాలలో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకోవడానికి ఏ అవకాశాన్నీ వదులుకోని ఈ ఇద్దరు నాయకుల మధ్య అరుదైన స్నేహభావం వ్యక్తమైంది.