కె.కోటేశ్వర రావు
చైర్మన్, శ్రీ భారత్ ట్రస్ట్
* మహాత్మా జ్యోతిరావు ఫూలే ద్విశతాబ్ది జయంత్యుత్సవాలు నివాళి
జ్యోతి రావు ఫూలేని జ్యోతిబా ఫూలే అని కూడా పిలుస్తారు. మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఏప్రిల్ 11,1827న మాలి కులంలో పండ్లు కూరగాయలు విక్రయించే శూద్ర కుటుంబంలో గోవిందరావు ఫూలే, చిమ్నా బాయ్ దంపతులకు రెండో కొడుకుగా జన్మించారు. అట్టడుగు వర్గాల స్త్రీ పురుషులు చదువు కోవాలని, అభివృద్ధిలోకి రావాలని తపించిన మానవతావాది. అస్పృశ్యతకు,కుల నిర్మూలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. వ్యాపారవేత్తగా, కాంట్రాక్టర్ గా, రచయితగా రాణించారు.
చదువుకునే రోజుల్లో బ్రాహ్మణ స్నేహితులున్నారు. కత్తి యుద్ధం, షూటింగ్ , మల్లయుద్ధంలలో కూడా శిక్షణ లభించింది. థామస్ పయిన్ రాసిన రైట్ అఫ్ ది మెన్ చదివిన ప్రేరణతో శివాజీ మహారాజ్ , జార్జ్ వాషింగ్టన్ తదితరులకు సంబంధించిన రచనలు, కబీర్ రచనలు, సంస్కృతంలో ఉన్న వేద సాహిత్యం ,ఇతర పురాణ గ్రంధాలు, బైబిల్, ఖురాన్ పుస్తకాలు చదివారు. వీటి అన్నిటి ప్రేరణతో సమాజంలో నిమ్న కులాల వారిపై జరిగే వివక్షపై గొంతెత్తారు.
సతీ సహగమనం, బాల్య వివాహాలు, వితంతు వుల పట్ల వివక్ష.. ఇలా అనేక సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా స్థిరంగా, ధైర్యంగా పోరాడారు. ఇందుకు ఉన్నత కులాల వారు ఈ దంపతులను వెలివేస్తే భయపడలేదు. అట్టడుగు వర్గాల ప్రజలకు సమాన హక్కులు ఏర్పడేలా ‘సత్య శోధక్ సమాజం’ ఏర్పాటు చేశారు. అన్ని మతాల వారు నిమ్న కులాలవారు ఈ సమాజంలో సభ్యులై హక్కుల కోసం పోరాటం చేసే అవకాశం కల్పించారు. 1848 నుంచి పూణే పరిసరాల్లో 18 పాఠశాలలు నెలకొల్పి ఉచిత విద్య అందించారు.
ఎందరో అభాగ్య బ్రాహ్మణ యువతుల జీవితాలను, ఇతర కులాల యువతుల జీవితాలను కాపాడేందుకు ఒక శరణాలయాన్ని పూలే దంపతులు 1880 వరకు నిర్వహించారు.
1882లో పర్యటించిన విద్యా కమీషన్ ముందు నిమ్న కులాల వారికి చదువుకునే అవకాశాలు ఎక్కువ కల్పించి, సహాయాలు చేయాలని, ప్రాథమిక విద్య అన్ని గ్రామాల్లో అందరికి తప్పనిసరిగా ఉండాలనే నిబంధన అమలు చేయాలని అనేక చోట్ల వాదించి వినతి పత్రాలు సమర్పించారు.
1882లో పర్యటించిన విద్యా కమీషన్ ముందు నిమ్న కులాల వారికి చదువుకునే అవకాశాలు ఎక్కువ కల్పించి, సహాయాలు చేయాలని, ప్రాథమిక విద్య అన్ని గ్రామాల్లో అందరికి తప్పనిసరిగా ఉండాలనే నిబంధన అమలు చేయాలని అనేక చోట్ల వాదించి వినతి పత్రాలు సమర్పించారు.
విద్యనూ, జ్ఞాన సముపార్జననూ జీవిత లక్ష్యాలుగా మలచుకున్నారు మహాత్మా ఫూలే. జ్ఞానం కొందరి గుత్తాధిపత్యం కాదనీ, ఆ శక్తి అందరికీ అందాలనీ స్పష్టంగా గుర్తించారాయన. సమాజంలో అనేకులకు అక్షర జ్ఞానం అందని ద్రాక్షగా ఉన్న ఆ కాలంలోనే బాలికల కోసం, విద్యావకాశాలు లేని వర్గాల కోసం పాఠశాలలను తెరిచి విద్యా విప్లవానికి నాంది పలికారు.
మహాత్మా ఫూలే తన విజ్ఞానంతో, వివేకంతో వ్యవసాయం, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి వంటి రంగాలపై విస్తృత అవగాహనను పెంపొందించుకున్నారు. రైతులు, కార్మికులకు అన్యాయం జరిగితే మన సమాజం బలహీనపడుతుందని ఆయనెప్పుడూ చెప్పేవారు. సామాజిక న్యాయాన్నీ, సమానత్వాన్నీ సాధించే శక్తిమంతమైన సాధనంగా తరగతి గదిని నిలిపి ఓ సరికొత్త సామాజిక దృక్పథాన్ని ఆవిష్కరించేందుకు ఆయన ఎంతగానో కృషిచేశారు.
1888లో ఒక పెద్ద సన్మానం చేస్తూ ఆయనకు `మహాత్మ’ అనే బిరుదు ఇచ్చారు. మహాత్మా గాంధీ కన్నా ముందే ఈ బిరుదు ఆయన పొందటం గమనార్హం. `నా ముగ్గురు గురువుల్లో ఒకరు’ అంటూ డా. బి. ఆర్. అంబేద్కర్ తాను 1946లో రచించిన `ఎవరు శూద్రులు’ అనే పుస్తకాన్ని మహాత్మా జ్యోతిరావు ఫూలేకు అంకితం ఇవ్వడం విశేషం! జ్యోతి రావు స్మృతి చిహ్నంగా మహారాష్ట్ర ప్రభుత్వమే కాకుండా అనేక సంస్థలు పలుచోట్ల కొన్ని నిర్మాణాలు సంస్థలు ఏర్పాటు చేశారు.
మహారాష్ట్ర విధాన్ భవన్ ఆవరణలో పెద్ద విగ్రహం ఏర్పాటు చేశారు. పుణేలో మహాత్మా ఫూలే మ్యూజియం ఏర్పాటు చేశారు. మహాత్మా ఫూలే కృషి విద్యాన్ పీఠ్ (అగ్రికల్చరల్ యూనివర్సిటీ)ని అహమ్మద్ నగర్ జిల్లాలో రాహురి వద్ద ఏర్పాటు చేశారు. నవంబర్ 28,1890న జ్యోతి రావు మృతి చెందారు.
తొలితరం ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే !
దేశం గర్వించదగ్గ అగ్రశ్రేణి సంస్కర్తల్లో ఆయన సతీమణి సావిత్రి బాయి పూలే ముందు వరుసలో నిలుస్తారు. దేశపు తొలితరం మహిళా ఉపాధ్యాయినిగా, బాలికా విద్యా వికాసంలో ఆమె నిర్ణయాత్మక పాత్ర పోషించారు. తద్వారా వారు కలలను సాకారం చేసుకునే అవకాశాన్నిచ్చారు. మహాత్మా ఫూలే మరణానంతరమూ. ఆ ఆశయ దీప్తిని సావిత్రీబాయి ఆరనివ్వలేదు. 1897లో ప్లేగు వ్యాధి విరుచుకుపడిన తరుణంలో బాధితుల సేవలో ఆమె పునరంకితమయ్యారు. చివరకు అదే వ్యాధికి గురై ప్రాణాలు విడిచిన త్యాగమూర్తి ఆమె.
కుల మత బేధాలు, ఆస్తి అంతస్తులు వయసు బేధాలు పాటించకుండా స్త్రీ పురుషులను చదువుకోమని 1848 నుంచే ప్రబోధించింది సావిత్రిబాయి పూలె. ఆమె చేసిన విప్లవ ప్రసంగాలు ఆనాటి మహిళలలో ఎందరికో స్ఫూర్తి నిచ్చింది. ఈమె గొప్ప రచయిత్రి, ఉపన్యాసకురాలు. చెడుపై సంయమనంతో పోరాడిన విప్లవ కారిణి. వితంతు వివాహాలు ప్రోత్సహించి, అనేక పెళ్లిళ్లు చేసి సామాజిక చైతన్యం తీసుకుని వచ్చిన ధీర వనిత.
ఆ రోజుల్లోనే మహిళలను ఒక త్రాటి మీదకు తీసుకు రావడానికి మహిళా సంఘం ప్రారంభించిన మహిళ. పురోహితుడు లేకుండా పెళ్లిళ్లు చేసిన సాహసి. అలా సామాజిక విప్లవం తెస్తూ మొదట నుంచి భర్తకు చేదోడు వాదోడుగా నిలబడిన ధీర వనిత! మన దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయు రాలిగా పేరు తెచ్చుకుని ఆడవారిని చదువుకో మని నినదిస్తూ ఉచితంగా చదువు చెప్పే ప్రయత్నం చేశారు.
మహారాష్ట్రలోని పూణే సమీపంలో జన్మించిన జ్యోతిరావు సావిత్రి బాయి ఫూలే దంపతులు 18వ శతాబ్దంలోనే నిమ్న కులాల సంతానమే కాకుండా అందరూ చదువుకోవాలని ప్రజల్ని ఉత్తేజపరిచారు. 18 పాఠశాలలు నెలకొల్పి ఉచిత విద్య అందించారు. అస్ప్రశ్యతపై, సతీ సహగమనంకి వ్యతిరేకంగా, వితంతువులపై అంక్షలపై పోరాటం జరిపారు. వారిద్దరి స్ఫూర్తి ఎల్లప్పుడూ నవభారత నిర్మాణానికి మార్గదర్శకంగానే ఉంటుంది.

More Stories
యుద్ధాన్ని వ్యాపారంగా మార్చుకున్న వైట్‌హౌస్
‘సీసీటీవీ’లతో సైనికుల కదలికలపై నిఘా పెట్టిన ఉగ్రముఠా
నాసిక్ బహుళజాతి సంస్థలో లైంగిక వేధింపుల గుట్టు రట్టు