సింగర్ మంగ్లీపై రూ. 10 కోట్ల మోసం కేసు

సింగర్ మంగ్లీపై రూ. 10 కోట్ల మోసం కేసు
తెలుగు రాష్ట్రాల్లో ఫోక్ సాంగ్స్‌తో విశేష గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ గాయని మంగ్లీ, మరో నలుగురిపై పెట్టుబడుల పేరుతో డబ్బులు సేకరించి మోసం చేయడం, అలాగే న్యాయవాదిని బెదిరించడం వంటి ఆరోపణలపై కేసు నమోదవడం సంచలనంగా మారింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో అధిక లాభాల మైక్రో ఫైనాన్స్ పేరుతో రూ.10 కోట్లు మోసం చేసినట్లు ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు.
 
మంగ్లీతో పాటు ఆమె సోదరుడు, మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదులో తనకు ప్రాణహాని ఉందని న్యాయవాది సుబ్బారావు పేర్కొన్నారు. దీంతో మొత్తం ఐదుగురిని బీఎన్ఎస్ సెక్షన్ 351(2), 352 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మైక్రో ఫైనాన్స్​ పథకాలలో పెట్టుబడులు పెట్టిస్తామని నమ్మించి రమావత్​ మధుపాల్​ అలియాస్​ భరత్​ చౌహాన్​, శైలజా చౌహాన్​, శివ (మంగ్లీ సోదరుడు), మంగ్లీ కలిసి సుమారు రూ.9.5 నుంచి రూ.10 కోట్ల వరకు సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

బాధితుల తరపున డబ్బులు తిరిగి ఇవ్వాలని నిలదీయగా, మంగ్లీ, ఆమె బృందం నుంచి బెదిరింపులు వచ్చాయని సుబ్బారావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంకా, ఈ కేసులో దర్శకుడు వేణు ఊడుగుల పేరు కూడా వెలుగులోకి రావడం గమనార్హం. మంగ్లీ, శివ, వేణు ఊడుగుల కలిసి ఫోన్ ద్వారా తీవ్రంగా బెదిరించారని, తనను యాక్సిడెంట్ చేయించి చంపేస్తామని హెచ్చరించారని న్యాయవాది ఆరోపించారు.