మహిళలు, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు

మహిళలు, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు

* పోటీ పరీక్షలకు రూ.15 వేలు, చొరబాట్లపై ఉక్కుపాదం.. బెంగాల్‌లో బీజేపీ హామీల వర్షం

పశ్చిమ్ బెంగాల్‌లో ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే కృతనిశ్చియంతో ఉన్న బీజేపీ .. ఏ అవకాశాన్ని వదులుకోరాదని భావిస్తోంది. ఇందులో భాగంగానే మహిళలు, రైతులు, యువతే లక్ష్యంగా ఆ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించింది. ఉచితాలకు తాము వ్యతిరేకమని చెప్పుకునే కమలనాథులు బెంగాల్‌లో మాత్రం అందుకు భిన్నంగా హామీలను గుప్పించింది. 

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కోసం శుక్రవారం బీజేపీ ‘సంకల్ప పత్రం’ పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది.  బీజేపీ కనుక అధికారంలోకి వస్తే చొరబాటుదారులపై కఠిన వైఖరి అవలంబిస్తామని స్పష్టం చేసింది.  బెంగాల్లోని ప్రతి మహిళకు, నిరుద్యోగ యువతకు నెలకు రూ.3000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన 45 రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏడో వేతన సంఘం ఏర్పాటు చేస్తామని పేర్కొంది. 
తాము అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోనే యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) అమలుజేస్తామని హామీ ఇచ్చింది. ‘బంగారు బెంగాల్’ నిర్మాణానికి ఈ మేనిఫెస్టోను రోడ్‌మ్యాప్‌గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభివర్ణించారు.  ‘‘బీజేపీ సంకల్ప పత్రం రైతులు, యువత, మహిళలకు మార్గనిర్దేశం చేస్తూ వారికి కొత్త దిశను చూపిస్తుంది. బెంగాల్ సంస్కృతి పట్ల గర్వపడే ప్రతి పౌరుడికి ఇది నూతన ఆశను అందిస్తుంది.. సోనార్ బంగ్లా సృష్టికి ఒక రోడ్‌‌‌మ్యాప్‌గా పనిచేస్తుంది’’ అని అమిత్ షా తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంక్షేమ నమూనాని బెంగాల్‌కు బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తుందని, కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ పూర్తి జవాబుదారీతనంతో అమలు జరిగేలా చూస్తుందని ఆయన తెలిపారు.  15 ఏళ్ల టీఎంసీ పాలన బెంగాలీలకు ఓ పీడకలను మిగిల్చిందని ఆయన దుయ్యబట్టారు.  రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. “ప్రజలు ఎంతో ఆశతో మమతా దీదీకి అధికారం ఇచ్చారు. కానీ ఈ రోజు వారే మార్పు కోరుకుంటున్నారు” అని చెప్పారు.
 
పోలీస్, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అలాగే, మహిళలకు ఆర్థిక సాధికారికత కల్పించేందుకు 75 లక్షల ‘లక్‌పతి దీదీల’ను సృష్టించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి మండలంలో కనీసం ఒక మహిళా పోలీస్ స్టేషన్‌తో పాటు, ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఒక సహాయ కేంద్రం కూడా ఉంటుందని షా చెప్పారు. 

తాము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే యూసీసీ అమలు చేసి తీరుతామని, బెంగాల్‌లోని ప్రతి పౌరుడికి ఒకే చట్టం ఉంటుందని పేర్కొన్నారు.  ఇక, యువతకు కూడా నిరుద్యోగ భృతి ప్రకటించారు. ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారికి నెలకు రూ. 3,000 భృతి ఇవ్వనున్నట్లు తెలిపారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారికి ఒకేసారి రూ. 15,000 ఆర్థిక సహాయం కూడా అందించనున్నట్లు షా చెప్పారు.

రైతుల విషయానికొస్తే పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద అదనంగా రూ. 3,000 ఇస్తామని, దీంతో మొత్తం సహాయం ఏడాదికి రూ. 9,000కు చేరుతుందని బీజేపీ హామీ ఇచ్చింది. రైతులు తమ పంటను తక్కువ ధరలకు అమ్ముకోవలసిన పరిస్థితి రాకుండా ఉండేందుకు, బీజేపీ ప్రభుత్వం వరికి క్వింటాల్‌కు రూ. 3,100 చొప్పున 100 శాతం కొనుగోలు చేస్తుందని షా ప్రకటించారు. వరి, బంగాళాదుంప, మామిడి పండించే రైతులకు సరైన విలువ లభించేలా ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు.