పవన్‌ ఖేరాకు తెలంగాణ హైకోర్టులో మధ్యంతరం బెయిల్‌

పవన్‌ ఖేరాకు తెలంగాణ హైకోర్టులో మధ్యంతరం బెయిల్‌

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత పవన్‌ ఖేరాకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. అస్సాం సీఎం హిమాంత బిశ్వశర్మ సతీమణి రిణికి భూయాన్‌ శర్మపై చేసిన వ్యాఖ్యల కేసులో హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్‌  మంజూరు చేసింది. వారం రోజులపాటు ఖేరాపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు పోలీసులను ఆదేశించింది.  అదేవిధంగా పోలీసులతో విచారణకు సహకరించాలని పవన్‌ ఖేరాకు కూడా ఆదేశాలు ఇచ్చింది.  

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సతీమణి రిణికి భూయాన్‌శర్మపై పవన్‌ ఖేరా తీవ్ర ఆరోపణలు చేశారు. రిణికి భూయాన్‌శర్మ వద్ద పలు దేశాలకు చెందిన పాస్‌పోర్టులు, పౌరసత్వాలు ఉన్నాయని పవన్‌ ఖేరా ఆరోపించారు.  ఈ విషయమై ఆయన పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దాంతో రిణికి శర్మపై కేసు నమోదైంది. రిణికి శర్మ కూడా తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ పవన్‌ ఖేరాపై కేసు పెట్టింది. దాంతో ఖేరా బెయిల్‌ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

పిటిషనర్‌ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ, సీనియర్‌ న్యాయవాది రవీందర్‌రెడ్డి వాదనలు వినిపించారు.  పిటిషనర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక, ఊహాజనిత కేసులు పెట్టి వేధించడానికి ప్రయత్నిస్తున్నారన్నారని వారు వాదించారు. పిటిషనర్‌ గురించి అస్సాం సీఎం అనుచితంగా మాట్లాడంతోపాటు 100 మందికిపైగా పోలీసులను ఢిల్లీలోని ఆయన నివాసానికి పంపడంలో దురుద్దేశం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

పిటిషనర్‌ భార్య హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేశారని, స్థానికంగా ఇక్కడే ఉంటున్నారని, కాబట్టి ఖేరా పిటిషన్‌పై విచారించే పరిధి ఈ కోర్టుకు ఉందని తెలిపారు. అస్సాం ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది దేవజిల్‌ షైకీ వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌పై నమోదైన కేసు సాధారణమైన పరువు నష్టం కేసు కాదని తెలిపారు.  సీఎం భార్య వద్ద పలు దేశాలకు చెందిన పాస్‌పోర్టులు, పౌరసత్వాలు ఉన్నాయన్న ఆరోపణలు చేయడానికి నకిలీపత్రాలను వినియోగించారని ఆరోపించారు.

నిందితుడు ఢిల్లీలో శాశ్వత నివాసి అనడానికి సంబంధించిన ఆధార్‌కార్డు ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ నివాసినంటూ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్‌ కె సుజన పిటిషనర్‌ పవన్‌ ఖేరాకు మధ్యంతర ఊరట ఇస్తూ బెయిల్ మంజూరు చేసింది. ఈలోపు సంబంధిత కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది.