ఇంట్లో నోట్ల కట్టలు వెలుగుచూసిన వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా చేశారు. అవినీతి ఆరోపణ కేసులో ఆయనపై అభిశంసన ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో జస్టిస్ వర్మ అకస్మాత్తుగా రాజీనామా చేశారు. ఈ నెల 9న రాష్ట్రపతికి రాసిన రాజీనామా లేఖలో ఆయన ఎటువంటి కారణాన్ని వెల్లడించలేదు. కానీ తక్షణమే అలహాబాద్ కోర్టు నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు.
ఈ రాజీనామా ప్రతిని భారత ప్రధాన న్యాయమూర్తికి కూడా పంపారు. గత ఏడాది ఢిల్లీలోని ఆయన నివాసం నుంచి భారీ ఎత్తున నోట్ల కట్లను రికవరీ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రపతికి రాసిన రాజీనామా లేఖలో ఆయన ఎటువంటి కారణాన్ని వెల్లడించలేదు. యశ్వంత్ వర్మ రాజీనామా చేయడం వల్ల ఆయనపై చేపట్టాల్సిన అభిశంసన ప్రక్రియ నిలిచిపోతుందని లోక్‌సభ సెక్రటేరియట్ వర్గాలు వెల్లడించాయి.
గతేడాది మార్చి 14న ఢిల్లీ హైకోర్టు జడ్జిగా ఉన్న సమయంలో జస్టిస్ వర్మ నివాసంలో భారీగా నోట్ల కట్టలు బయటపడటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీని ఫలితంగా 2025 జులైలో లోక్‌సభలో 145 మంది, రాజ్యసభలో 63 మంది ఎంపీలు ఆయనపై అభిశంసన తీర్మానానికి నోటీసులు ఇచ్చారు. దీంతో లోక్‌సభ స్పీకర్ ‘జడ్జెస్ (ఇన్‌క్వైరీ) యాక్ట్, 1968’ ప్రకారం ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏర్పాటును జస్టిస్ వర్మ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. అయితే, ఆయన పిటిషన్‌ను జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది,
ఈ ఘటనపై అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, అంతర్గత విచారణ కోసం ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులతో ఓ కమిటీని వేశారు. జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణలు నిజమని, నోట్ల కట్టలు దొరికింది వాస్తవమేనని, ఆయన ప్రవర్తన న్యాయవృత్తికి విరుద్ధమని తేల్చింది. అలాగే విచారణ కమిటీ ఇచ్చిన దర్యాప్తు నివేదికను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు జస్టిస్ యశ్వంత్ వర్మ. అయితే అత్యున్నత న్యాయస్థానంలోను ఆయనకు ఊరట దక్కలేదు.
సుప్రీం ఆయన పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో రాజీనామా చేయాల్సిందిగా జస్టిస్ వర్మకు సీజేఐ సూచించారు. ఆయన తిరస్కరించడంతో అభిశంసనకు సిఫారసు చేస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీలకు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి లేఖలు రాశారు. ఫలితంగా ఆయనపై అభిశంసన ప్రక్రియకు బాట పడింది.
More Stories
బెంగాల్ లో తొలగించిన ఓటర్లలో 63% మంది హిందువులే
మహిళా, పునర్విభజన బిల్లులపై కాంగ్రెస్ సందిగ్ధత
ఆలయాల్లో కొందరికే అనుమతిస్తే హిందూమతంకే నష్టం