బలం పుంజుకున్న భారత్ రూపాయి

బలం పుంజుకున్న భారత్ రూపాయి

విదేశీ మారకద్రవ్య మార్కెట్‌లో భారత రూపాయి కొంత బలాన్ని ప్రదర్శించింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో సుమారు 10 పైసలు పెరిగి 92.57 స్థాయికి చేరుకుంది. గత గురువారం ముగింపు సమయంలో ఇది 92.66 వద్ద నమోదైంది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా బ్యాంకులు తమ ఆర్బిట్రేజ్‌ పొజిషన్లను సర్దుబాటు చేసుకోవడం కనిపిస్తోంది. 

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నిర్దేశించిన గడువు నేటితో ముగియడంతో బ్యాంకులు తమ ఓపెన్‌ పొజిషన్లను తగ్గించే పనిలో నిమగ్నమయ్యాయి. ఎన్‌డీఎఫ్‌ (నాన్‌-డెలివరబుల్‌ ఫార్వర్డ్స్‌) మార్కెట్‌లో అధిక లావాదేవీలను నియంత్రించేందుకు ఆర్బీఐ గత నెలలో నియంత్రణలు విధించింది.  ప్రతి పనిదినం ముగిసే సమయానికి బ్యాంకుల నికర ఓపెన్‌ పొజిషన్‌ 100 మిలియన్‌ డాలర్లకు మించకూడదని ఆదేశాలు జారీ చేసింది.

ఈ గడువును పొడిగించాలని బ్యాంకులు కోరినా, ఆర్బీఐ అందుకు అనుమతి ఇవ్వలేదు. ఫలితంగా బ్యాంకులు తమ లావాదేవీలను తగ్గిస్తూ మార్కెట్‌లో జాగ్రత్త ధోరణిని అవలంబిస్తున్నాయి. తదుపరి మార్గదర్శకాల కోసం మార్కెట్‌ పాల్గొనేవారు వేచి చూస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం మరోవైపు ఆందోళన కలిగిస్తోంది.

బ్రెంట్‌ క్రూడ్‌ ధర 97 డాలర్లకు చేరగా, యూఎస్‌ డబ్ల్యూటీఐ క్రూడ్‌ ధర 99.24 డాలర్లను దాటింది. దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో కూడా చమురు ఫ్యూచర్స్‌ ధరలు గణనీయంగా పెరిగి రూ. 9,222 వద్ద ట్రేడవుతున్నాయి.  ఈ పరిణామాలపై ఆర్బీఐ గవర్నర్‌ సంజరు మల్హోత్రా స్పందిస్తూ విదేశీ మారక ద్రవ్య మార్కెట్‌లో స్థిరత్వాన్ని కాపాడేందుకు తాత్కాలిక చర్యలుగానే ఈ ఆంక్షలను అమలు చేశామని తెలిపారు. బ్యాంకుల ఆర్బిట్రేజ్‌ ట్రేడింగ్‌ పెరగడం వల్లే ఇటీవల మార్కెట్‌లో అస్థిరత పెరిగిందని ఆయన పేర్కొన్నారు.